బెంగళూరు: “నా శరీర రంగు కారణంగా నేటికీ మా ఊరిలోని దేవాలయాల్లోకి మాకు ప్రవేశం లేదు. పండగలు అంటే మా జీవితంలో సంతోషాన్ని ఇచ్చేవి కావు, పైగా దుఃఖాన్ని మోసుకొచ్చేవి. పండగలు ఎందుకు వస్తాయా అని నేను తిట్టుకునేవాడిని. మా అమ్మానాన్నలు ఈ వివక్షను చూసి ఏడవటం నేను కళ్లారా చూశాను.” అంటూ కర్ణాటకలో తాను ఎదుర్కొన్న కుల వివక్ష, వర్ణవివక్ష గురించి నటుడు వినోద్ సూర్యవంశీ తన ఆవేదనను పంచుకున్నారు.
ప్రముఖ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ సీజన్ 3లో కొత్త సచివ్ జీ పాత్రలో నటించిన వినోద్ సూర్యవంశీ అసలు సిసలు కర్ణాటక వాసి. పేదరికంలో పుట్టి, నల్లని శరీర రంగు మరియు వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తిగా తాను అనుభవించిన అవమానాలను సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
పండగ ఆనందమే లేదు: “పండగ వస్తే ఎందుకు వస్తుందో అనిపించేది. ఎందుకంటే ఇతరులలా మేము వాటిని ఎప్పుడూ జరుపుకోలేము. ఎవరైనా మాకు డబ్బు లేదా బియ్యం ఇస్తేనే మేము పండగ చేసుకోగలం. ఇదే మా ప్రతి పండగ వాస్తవికత. దీనివల్ల ప్రతిసారి మా అమ్మ విలపించేది” అని ఆయన అన్నారు.
కష్టాలతో కూడిన బాల్యం: “మా అమ్మ ఇళ్లలో పనులు చేసేది. నా తండ్రి మేస్త్రీ. ఆయనకు ప్రతిరోజూ పని దొరికేది కాదు. పని లేనప్పుడు ఆయన తాగి వచ్చి మా అమ్మను తిట్టేవాడు, కొట్టేవాడు. ఇదంతా చూస్తూ పెరగడం చాలా భయంకరంగా అనిపించేది. కానీ నేను నా తండ్రిని ఎప్పుడూ ద్వేషించలేదు. నా బాల్యం ఏ దశలోనూ బాగులేదు, ప్రతి క్షణం నొప్పిని అనుభవించాను” అని వినోద్ పేర్కొన్నారు.
నేటికీ ఆలయ ప్రవేశం లేదు: “మా ఊరిలో నేటికీ అగ్రవర్ణాల వారు ఒకచోట, దళితులు మరోచోట నివసిస్తున్నాము. దళితుల నివాస ప్రాంతం ప్రధాన గ్రామానికి దూరంగా ఉంటుంది. ఇప్పటికీ మా కుటుంబం దేవాలయానికి వెళ్లే పరిస్థితి లేదు. ఇతరుల ఇళ్లలోకి మమ్మల్ని రానివ్వరు” అని తన బాధను వెలిబుచ్చారు.
డబ్బులిచ్చి మరీ ప్లేట్లు కడిగాను: “నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు నా తండ్రితో కలిసి ఒక హోటల్‌కు వెళ్లాను. అక్కడ మాకు కావలసింది కొనుక్కుని తిన్నాము. కానీ, మేము డబ్బులు చెల్లించినప్పటికీ, తిన్న తర్వాత మా ప్లేట్లను మేమే కడుక్కోవాల్సి వచ్చింది. డబ్బు ఇచ్చినా అక్కడ సమానత్వం కనిపించలేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లిఫ్ట్ మ్యాన్ నుండి నటుడి వరకు: చిత్ర పరిశ్రమలోకి రాకముందు వినోద్ రూ. 1600 జీతానికి లిఫ్ట్ మ్యాన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ గార్డ్‌గా కూడా పనిచేశారు. వర్షంలో నిలబడి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నప్పుడు బూట్లలోకి నీరు చేరి కాళ్లకు బొబ్బలు వచ్చేవి. మనుషులు మనల్ని చూసే విధానం మనం చేసే పనిపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
తొమ్మిదేళ్ల తర్వాత దక్కిన అవకాశం: ఒక స్నేహితుడి ద్వారా రూ. 500 కి జూనియర్ ఆర్టిస్ట్ అవకాశం రావడంతో వినోద్ కెరీర్ ప్రారంభమైంది. రెండేళ్ల పాటు షూటింగ్ సెట్‌నే పాఠశాలగా భావించి పని నేర్చుకున్నారు. ఎప్పటికైనా మంచి అవకాశం వస్తుందన్న నమ్మకంతో తొమ్మిదేళ్లు ఎదురుచూశాక, ‘పంచాయత్’ సిరీస్‌లో సెక్రటరీ పాత్ర ఆయన జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఆయన ‘జాలీ ఎల్.ఎల్.బి 3’, ‘జానవర్’ వంటి వెబ్ సిరీస్‌లు మరియు సినిమాల్లో నటిస్తున్నారు.
