బెంగళూరు అవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లప్ప గార్డెన్ ప్రాంతానికి చెందిన ముబారక్ అనే వ్యక్తి.. రెండేళ్ల క్రితం హఠాత్తుగా వచ్చిన పక్షవాతం (పారాలిసిస్) కారణంగా కదలలేని స్థితికి చేరుకుని, పనికి వెళ్లలేక మంచానికే పరిమితమయ్యాడు.
దీనితో ఆ ఇంట్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అదే ప్రాంతానికి చెందిన నహీమ్ ఖురేషి అనే వ్యక్తి ఆ కుటుంబానికి డబ్బు, నిత్యావసర సరుకులు సమకూరుస్తూ వారికి దగ్గరయ్యాడు. ఆ చనువు కాస్తా క్రమంగా ముబారక్ భార్య షాహినా భాను మరియు నహీమ్ ఖురేషి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
భర్త ముబారక్ మంచానికే పరిమితమైన నిస్సహాయతను అవకాశంగా తీసుకుని.. షాహినా భాను, నహీమ్ ఖురేషి తమ అక్రమ సంబంధాన్ని యథేచ్ఛగా కొనసాగించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వారి తీరును గమనించిన ముబారక్ వారిని తీవ్రంగా మందలించాడు. భర్త తమ వివాహేతర బంధానికి అడ్డుగా మారాడని భావించిన షాహినా భాను.. అతడిని ఎలాగైనా శాశ్వతంగా అడ్డు తొలగించుకుని, ప్రియుడితో కలిసి జీవించాలని పథకం పన్నింది. ఈ కుట్రకు ఆమె తన తల్లి హసీనా, ప్రియుడు నహీమ్ ఖురేషిల సహాయం కూడా తీసుకుంది.
పథకం ప్రకారం ఈ నెల 9వ తేదీన.. మంచంపై నిస్సహాయంగా పడివున్న ముబారక్ గొంతును ముగ్గురూ కలిసి నులిమి అతి కిరాతకంగా హతమార్చారు. తాము చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు.. పక్షవాతంతో ఉన్న ముబారక్ గుండెపోటుతో సహజంగానే మరణించాడంటూ నాటకమాడి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేందుకు యత్నించారు. అయితే వారి ప్రవర్తనపై తీవ్ర అనుమానం వచ్చిన చుట్టుపక్కల స్థానికులు వెంటనే అవలహళ్లి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదికలో ముబారక్ గొంతు నులమడం వల్లే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారణ కావడంతో.. పోలీసులు షాహినా భానును గట్టిగా విచారించగా ఆమె తన నేరాన్ని ఒప్పుకుంది. పక్షవాతంతో ఉన్న భర్తను అంతమొందించి ప్రియుడితో కాపురం పెట్టేందుకే ఈ హత్య చేసినట్లు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా.. షాహినా భాను, ఆమె ప్రియుడు నహీమ్ ఖురేషి, తల్లి హసీనాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
