న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో యుద్ధ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో, గల్ఫ్ ప్రాంతంలో ఉన్న లక్షలాది మంది భారతీయ పౌరుల భద్రతను పర్యవేక్షించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
ప్రస్తుత పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, ప్రవాసులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి మరియు సముద్ర వ్యాపారం స్థిరంగా సాగేలా చూడటానికి సమన్వయంతో కూడిన ప్రయత్నాలు జరుగుతున్నాయని సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు (Embassies), కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్‌లైన్ నంబర్లను ప్రారంభించాయి. భారత పౌరులు ఇరాన్ దేశానికి వెళ్లే ప్రయాణాలను పూర్తిగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఇరాన్లో ఉన్న వారు ఎంబసీ సహాయంతో తిరిగి రావాలని అధికారులు సూచించారు. ఇప్పటివరకు 2,549 మంది భారతీయ పౌరులను సరిహద్దుల ద్వారా ఇరాన్ నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, బహ్రెయిన్ దేశాల్లో విమాన మార్గాలు తెరిచే ఉన్నాయని, విమాన సర్వీసులు సాధారణంగానే నడుస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖతార్ వైమానిక మార్గం పాక్షికంగా అందుబాటులో ఉంది. ఇరాక్, ఇజ్రాయెల్ దేశాలలో విమాన సర్వీసులు పరిమితంగా ఉన్నాయి.
నౌకాదళ సిబ్బంది భద్రత కోసం షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత మూడు రోజుల్లో భారతీయ నౌకలపై గానీ, నావికులపై గానీ ఎటువంటి దాడులు జరగలేదు. కంట్రోల్ రూమ్‌ల ద్వారా ఇప్పటివరకు 3,096 మంది నావికులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చారు. పశ్చిమ ఆసియాలోని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సమాచారాన్ని పంచుకుంటున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
