“పాకిస్తాన్ అనే దేశం నేడు ఉందంటే ఆ సీక్రెట్టే కారణం” — జిన్నా మరణ రహస్యం; భారత వైద్యులకు పాక్ ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటన..!!

భారత చరిత్రలోనే అత్యంత కీలక మలుపైన భారత–పాకిస్తాన్ విభజన సమయంలో, పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా అనారోగ్యానికి సంబంధించిన విస్తుపోయే నిజాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచిన ముంబైకి చెందిన ఇద్దరు పార్సీ వైద్యులకు.. దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది.

జిన్నా అనారోగ్యం – వైద్యుల గోప్యత:
1930ల నుంచే మహమ్మద్ అలీ జిన్నా తీవ్రమైన క్షయవ్యాధితో (టీబీ) బాధపడుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందనే విషయం కేవలం ఆయన అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలిసిన అతిపెద్ద రహస్యం.

ఈ క్రమంలో 1946లో ముంబైకి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ జల్ రతన్‌జీ పటేల్, రేడియాలజిస్ట్ డాక్టర్ జల్ తైయబ్జీ జిన్నా ఎక్స్-రేలను పరీక్షించారు. ఆ సమయంలో జిన్నా ఊపిరితిత్తుల క్షయవ్యాధి చివరి దశకు చేరుకుందని, ఆయన మహా అయితే మరో ఒకటి లేదా రెండేళ్లు మాత్రమే బతుకుతారని వారు నిర్ధారించారు.

విభజన నాటి రాజకీయ ముఖచిత్రాన్నే తలకిందులు చేయగలంతటి అత్యంత కీలక సమాచారం అది అయినప్పటికీ, ఆ వైద్యులు తమ రోగికి సంబంధించిన వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని (Medical Confidentiality) బయటకు పొక్కనివ్వలేదు. వైద్య వృత్తి ధర్మాన్ని నిలబెడుతూ జిన్నా అంతర్గత వలయం దాటి ఆ నిజాన్ని ఎక్కడా బహిర్గతం చేయలేదు.

చరిత్రను మార్చిన మౌనం:
ఒకవేళ జిన్నా ఆరోగ్య పరిస్థితి గురించిన నిజం బ్రిటిష్ పాలకులకు, భారత జాతీయ నాయకులకు ముందే తెలిసి ఉంటే దేశ విభజన దిశ, సమయం పూర్తిగా మారిపోయి ఉండేవా అనే చారిత్రక చర్చ నేటికీ కొనసాగుతోంది. ప్రముఖ చారిత్రక గ్రంథం ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ (Freedom at Midnight) పుస్తకంలోనూ ఈ అంశంపై విస్తృతంగా ప్రస్తావించారు.

చివరి వైస్రాయ్ లార్డ్ లూయిస్ మౌంట్‌బాటన్ సైతం — “జిన్నా ఆరోగ్య పరిస్థితి గురించి నాకు ముందే తెలిసి ఉంటే, నేను అధికార మార్పిడిని వాయిదా వేసేవాడిని (ఆలస్యం చేసేవాడిని)” అని తరువాతి కాలంలో వ్యాఖ్యానించినట్లు వచ్చిన సమాచారం ఈ చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

విభజన అనంతరం జిన్నా ఆరోగ్యం వేగంగా క్షీణించింది. పాకిస్తాన్ ఏర్పడిన ఏడాదికే, అంటే 1948 సెప్టెంబర్ 11న ఆయన ఊపిరితిత్తుల క్షయవ్యాధితో కన్నుమూశారు.

పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం:
జిన్నా మరణించి దశాబ్దాలు గడిచిన తర్వాత.. ఆయన జీవించి ఉన్న సమయంలో ఆ వైద్యులు పాటించిన వృత్తిపరమైన గోప్యతే పరోక్షంగా పాకిస్తాన్ ఆవిర్భావానికి దారితీసిన కీలక పరిణామాలలో భాగమైందని పాక్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ ప్రణాళికా శాఖ మంత్రి మరియు అవార్డుల కమిటీ చైర్మన్ అహ్సాన్ ఇక్బాల్ ఆ ఇద్దరు దివంగత వైద్యుల విశిష్ట సేవలను కొనియాడుతూ, వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్-ఎ-ఇంతియాజ్’ (Nishan-i-Imtiaz) అవార్డును ప్రకటించారు. 2027 మార్చిలో జరిగే అధికారిక కార్యక్రమంలో దివంగతులైన ఆ వైద్యుల తరఫున వారి కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.


Posted

in

by

Tags: