పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య వివాదం ఇప్పుడు తీవ్ర సైనిక ఘర్షణగా మారింది. శుక్రవారం తెల్లవారుజామున పాకిస్థాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌తో సహా పలు ప్రధాన నగరాలపై శక్తివంతమైన దాడులు చేసింది.
ఈ క్రమంలో, పాకిస్థాన్ చేసిన వైమానిక దాడుల్లో తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా మరణించాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అసలేం జరిగింది?
పాకిస్థాన్ “ఆపరేషన్ గజబ్-లీల్-హక్” ప్రకటించిన తర్వాత ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. తొలుత కాబూల్‌పై దాడి జరిగినట్లు భావించినప్పటికీ, అందరి దృష్టి తక్షణమే కందహార్ వైపు మళ్లింది. కందహార్ నుండే తాలిబన్ల కార్యకలాపాలు సాగుతుంటాయి మరియు ఇది అఖుంద్జాదాకు ప్రధాన స్థావరంగా భావిస్తారు. అక్కడ గగనతలంలో యుద్ధ విమానాల శబ్దాలు విన్పించినట్లు సమాచారం.
రెండు గంటలకు పైగా యుద్ధ విమానాలు ఎగిరాయని, ఆ తర్వాత పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వచ్చాయని కాబూల్‌లోని ఏఎఫ్పి (AFP) జర్నలిస్టులు తెలిపారు. కందహార్లో కూడా విమానాలు తిరిగినట్లు రిపోర్టర్లు ధృవీకరించారు. దీనితో తాలిబన్ నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయనే ఊహాగానాలు మొదలయ్యాయి.
తాలిబన్ల ఖండన
పాకిస్థాన్ వైమానిక దాడులు జరిగిన మాట వాస్తవమేనని తాలిబన్ యంత్రాంగం అంగీకరించింది. అయితే, తమ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే వార్తలను వారు తోసిపుచ్చారు. తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, నాయకత్వానికి లేదా కమాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు.
అయితే, ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది ఆఫ్ఘన్ సైనికులు మరణించినట్లు ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ తర్వాత ధృవీకరించింది.
TTP స్థావరాలే లక్ష్యం: పాకిస్థాన్ వివరణ
మరోవైపు పాకిస్థాన్ కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. తాలిబన్ సుప్రీం లీడర్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం ఏదీ జరగలేదని తెలిపింది. డ్యూరాండ్ లైన్ (Durand Line) సమీపంలో ఉన్న తహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) స్థావరాలపైనే తాము దాడులు చేశామని పాక్ పేర్కొంది. తీవ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగానే ఈ దాడులు చేసినట్లు వెల్లడించింది. అఖుంద్జాదాపై నేరుగా దాడి చేయడం అత్యంత ప్రమాదకరమైన చర్య అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి, అఖుంద్జాదాను పాకిస్థాన్ నేరుగా లక్ష్యంగా చేసుకుందనడానికి ఎటువంటి విశ్వసనీయమైన ఆధారాలు లేవు.
