బీహార్లోని పాట్నా జిల్లాలో హై-వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. బార్హ్ సబ్-డివిజన్లోని పంచమహాల ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి, సోనూ-మోనూ అనే గ్యాంగ్స్టర్ల నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వెళ్లగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
మాజీ ఎమ్మెల్యే ఆనంత్ సింగ్కు మద్దతుదారుడైన ముఖేష్ కుమార్ అనే వ్యక్తిపై గ్యాంగ్స్టర్లు కాల్పులు జరిపారని ఫిర్యాదు రావడంతో, పోలీసులు అర్ధరాత్రి వారి ఇంటికి వెళ్లారు. అయితే, గ్యాంగ్స్టర్ల తల్లి ఊర్మిళా సిన్హా మరియు వారి మద్దతుదారులు పోలీసులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దాదాపు అర గంట పాటు పోలీసులకు, మద్దతుదారులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో హతిదా స్టేషన్ ఎస్హెచ్ఓ రంజన్ కుమార్ నిందితుడు సోనూతో ఫోన్లో మాట్లాడి, వారెంట్ లేకపోయినా చట్టబద్ధంగా సోదాలు చేసే అధికారం తమకు ఉందని వివరించారు. చివరకు నిందితుల మద్దతుదారులు ఒక షరతు విధించారు. పోలీసులు లోపలికి వెళ్లే ముందు వారిని తాము తనిఖీ (ఫ్రిస్కింగ్) చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అందుకు అంగీకరించగా, వారిని తనిఖీ చేశాక పోలీసులు లోపలికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నౌరంగ జలాల్పూర్ గ్రామంలో సర్పంచ్ భర్త ముఖేష్ సింగ్, ముఖియా భర్త ప్రమోద్ సింగ్ మధ్య జరిగిన గొడవలో సోనూ కుమార్ గాలిలోకి కాల్పులు జరిపాడని ఎస్డీపీఓ రామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వైరల్ అయిన వీడియోలను పరిశీలిస్తున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
