పాఠాలు వింటున్న చిన్నారికి ఒక్కసారిగా ఫిట్స్.. బయట డీజే మోతతో విషాదం! తరగతి గదిలో చదువుకుంటున్న రెండో తరగతి విద్యార్థిని ఒక్కసారిగా అస్వస్థతకు గురై మృతి.. వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియో!

ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన విషాద ఘటన తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

తరగతి గదిలో పాఠాలు వింటున్న రెండో తరగతి బాలిక ఒక్కసారిగా అస్వస్థతకు గురై మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

బలరాంపూర్‌కు చెందిన సోను తివారీ కుమార్తె స్థానిక డివైన్ పబ్లిక్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. గత సోమవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన బాలిక… మొదటి అంతస్తులోని తరగతి గదిలో కూర్చొని చదువుకుంటోంది.

అదే సమయంలో ఆ ప్రాంతం మీదుగా వినాయక నిమజ్జన ఊరేగింపు వెళ్తోంది. ఊరేగింపులో భారీ శబ్దంతో డీజే సంగీతాన్ని వినిపించినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన సుమారు 3 నిమిషాల 2 సెకన్ల సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి.

ఆ వీడియోలో… తరగతి గదిలో విద్యార్థులంతా ప్రశాంతంగా కూర్చొని చదువుకుంటుండగా, బయట నుంచి భారీ శబ్దంతో డీజే మ్యూజిక్ వినిపిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఆ శబ్దానికి కొంతమంది పిల్లలు బయట ఏం జరుగుతుందో చూడటానికి ప్రయత్నించారు. దీంతో తరగతి గదిలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.

ఈ సమయంలోనే ఆ బాలికకు వరుసగా మూడుసార్లు ఫిట్స్‌ వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రికి తీసుకెళ్తున్న మార్గంలోనే ఆ చిన్నారి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటనపై పాఠశాల మేనేజర్ ఆశిష్ ఉపాధ్యాయ్ స్పందించారు. ఇది తమకు తీరని విషాదమని తెలిపారు. సీసీటీవీ దృశ్యాలు ఘటనను చూపిస్తున్నాయని ఆయన చెప్పారు.

అయితే… ఊరేగింపులో వినిపించిన అతిగా ఉన్న డీజే శబ్దం వల్లే బాలిక ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని మేనేజర్ తెలిపారు.

అయితే బాలిక మృతికి అసలు కారణం ఏమిటనేది వైద్య నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టంగా తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటన నేపథ్యంలో… పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాల సమీపంలో భారీ శబ్దంతో డీజేలు వినియోగించడంపై మరోసారి చర్చ మొదలైంది.


Posted

in

by

Tags: