ముంబైలో ఓ విదేశీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దివ్యాంగ వృద్ధుడికి డబ్బులు సహాయం చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
అయితే, ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళకు, ఇన్ఫ్లుయెన్సర్కు మధ్య జరిగిన వాగ్వాదం ఈ వ్యవహారాన్ని తీవ్ర చర్చనీయాంశంగా మార్చింది.
‘Cris Travelss’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ముంబై వీధిలో కూర్చుని ఉన్న దివ్యాంగ వృద్ధుడికి ఆ విదేశీయుడు రూ.100 ఇచ్చాడు. అది చూసిన ఓ మహిళ అక్కడికి వచ్చి, తనకు వైద్య ఖర్చులు, తిండికి సహాయం కావాలని చెబుతూ అతనికి డబ్బులు ఇవ్వడాన్ని తప్పుబట్టింది.
దీంతో ఆ విదేశీయుడు వృద్ధుడితో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. తనకు పోలియో సోకిందని, కనీసం నడవలేని స్థితిలో ఉన్నానని ఆ వృద్ధుడు తెలిపాడు. అయినప్పటికీ ఆ మహిళ మాత్రం, అతను రెగ్యులర్గా భిక్షాటన చేస్తాడని, రోజూ దానాల ద్వారా దాదాపు రూ.2,000 వరకు సంపాదిస్తాడని ఆరోపించింది.
ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగినప్పటికీ, ఆ ఇన్ఫ్లుయెన్సర్ తన నిర్ణయానికి కట్టుబడి వృద్ధుడికి మద్దతుగా మాట్లాడాడు. వృద్ధుడి శారీరక స్థితిని గుర్తుచేస్తూ.. నీకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటే తప్పకుండా సహాయం చేసేవాడినని ఆమెకు స్పష్టం చేశాడు. అంతేకాకుండా, ఆ వృద్ధుడికి మరో రూ.100 కలిపి మొత్తం రూ.200 అందజేశాడు.
మానవతా దృక్పథంతోనే ఆ వృద్ధుడికి సహాయం చేశానని, ఇలాంటి పరిస్థితిలో మీరుంటే ఏం చేసేవారని ప్రశ్నిస్తూ ఆయన ఈ వీడియోను పంచుకున్నాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్న కోణాల్లో స్పందిస్తూ విరివిగా చర్చిస్తున్నారు.
