చిన్నతనంలో ఎముకలను దృఢపరచుకోవడానికి పాలు తాగమని సలహా ఇచ్చినప్పటికీ, వయసు పైబడే కొద్దీ వచ్చే ఎముకల విరుగుడు, బలహీనత గురించి మనం ఎక్కువగా ఆలోచించము.
వృద్ధాప్యంలో మన ఎముకల బలం అనేది చిన్నతనంలో, నవయవ్వనంలో మనం సేకరించి దాచుకునే ఎముకల సాంద్రతపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా, మహిళల్లో మేనోపాజ్ (రజోనివృత్తి) తర్వాత, పురుషుల్లో వృద్ధాప్యం వల్ల ఎముకల అరుగుదల, విరిగే ప్రమాద అవకాశాలు చాలా ఎక్కువవుతాయి.
ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు మాత్రమే సరిపోవు. పాల ఉత్పత్తుల్లోని కాల్సియం, ప్రొటీన్ పోషకాలు ఎముకలను కాపాడటంతో పాటు వృద్ధులలో కింద పడటం వల్ల కలిగే ఎముకల విరుగుళ్లను నివారించడానికి సహాయపడతాయి. అయితే పాల ఉత్పత్తులే కాకుండా ఇతర అనేక ఆహారాలు కూడా ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి.
సోయా ఆహారాలైన టోఫు, టెంపేలలో అధిక పరిమాణంలో కాల్సియం ఉంటుంది. అంతేకాకుండా చియా గింజలు, ఎండు ఫలాలు అయిన అంజీర్, ఖర్జూరం, చేపలు వంటి ఆహారాలు కూడా ఎముకలను దృఢపరచడానికి తోడ్పడతాయి. చేపలలో ఉండే విటమిన్ డి పోషకం శరీరం కాల్సియంను సులభంగా గ్రహించేలా చేస్తుంది.
సమతుల ఆహారం తీసుకునేవారికి విడిగా పోషక మాత్రలు అవసరం లేదు. అయినప్పటికీ ఆహారం ద్వారా సరిపడా కాల్సియం, విటమిన్ డి లభించనివారు వైద్యుడి సలహాతో మాత్రలను తీసుకోవచ్చు. కాబట్టి సరైన పోషకాలున్న ఆహారాలతో పాటు చురుకైన శారీరక వ్యాయామాలను చేయడం జీవితాంతం ఎముకలను బలంగా ఉంచడానికి ఉత్తమమైన మార్గం.

Leave a Reply