చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం బైట్‌డాన్స్ (ByteDance), దాని ఆధ్వర్యంలోని పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok).. మైనర్ పిల్లల వ్యక్తిగత డేటాను చట్టవిరుద్ధంగా సేకరించి ప్రకటనదారులకు విక్రయించాయన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
తల్లిదండ్రుల ముందస్తు అనుమతి లేకుండానే పిల్లల పేర్లు, ఈమెయిల్ ఐడీలు వంటి అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిన టిక్‌టాక్, వాటిని పలు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు అమ్ముకుని భారీగా లాభాలు ఆర్జించిందంటూ అమెరికా కోర్టులో దాఖలైన దావాపై విచారణ ముమ్మరంగా సాగింది.
ఈ నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం వేసిన ఈ కేసును మరింత పొడిగించకుండా రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు టిక్‌టాక్ యాజమాన్యం అంగీకరించింది. ఇందులో భాగంగా దాదాపు రూ.3,300 కోట్లు ($400 మిలియన్ డాలర్లు) భారీ జరిమానా చెల్లించేందుకు బైట్‌డాన్స్ కంపెనీ సమ్మతించింది.
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది యూజర్లు ఉన్న టిక్‌టాక్ యాప్.. చిన్నారుల భద్రత, డేటా ప్రైవసీ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించి ఇంత భారీ జరిమానా చెల్లించాల్సి రావడం అంతర్జాతీయంగా టెక్ నిపుణులను, యూజర్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Leave a Reply