“ఆషాఢంలో పుడితే అష్టకష్టాలు” లేదా ఆషాఢ మాసంలో పిల్లలు జన్మించకూడదనే ప్రచారాలు ఎలాంటి ఆధ్యాత్మిక, శాస్త్రీయ ఆధారం లేని కేవలం మూఢనమ్మకాలు మాత్రమే. వాస్తవానికి ఆషాఢ మాసం అనేది దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యే సమయం, అమ్మవారి ఆరాధనకు మరియు గ్రామదేవతల పూజలకు అత్యంత పవిత్రమైన మాసం.
జ్యోతిష్యశాస్త్ర పరంగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే ఈ కాలంలో జన్మించే పిల్లల భవిష్యత్తు వారి జన్మకుండలిలోని గ్రహ స్థితులను బట్టి ఉంటుందే తప్ప, పుట్టిన మాసం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. కేవలం ప్రాస కోసం చెప్పిన ఇలాంటి మాటలకు ఎలాంటి ఆధారాలు లేవు.
మన పెద్దలు అలా చెప్పడం వెనుక పూర్తిగా నాటి జీవనశైలి మరియు ఆరోగ్య కారణాలు మాత్రమే ఉన్నాయి:
- ఆషాఢ మాసంలో తీవ్రమైన గాలులు వీచి వాతావరణంలో మార్పులు రావడం వల్ల, అప్పుడే పుట్టిన పసిపిల్లలకు ఇన్ఫెక్షన్లు, వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువని భావించారు.
- అలాగే వ్యవసాయ పనులు మొదలయ్యే కీలకమైన సమయం కావడంతో, కుటుంబంలోని వారంతా పొలం పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఆ సమయంలో ప్రసవం జరిగితే తల్లిని, పుట్టిన బిడ్డను సరిగ్గా చూసుకునే తీరిక ఎవరికీ ఉండదనే ఉద్దేశంతోనే పాతకాలంలో ఇలాంటి కట్టుబాట్లు పెట్టారు.
ఆధునిక వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న నేటి కాలంలో ఇలాంటి అనవసర భయాలను, అపోహలను పక్కనపెట్టి.. పిల్లలు ఏ మాసంలో జన్మించినా వారిని ఆరోగ్యంగా, సన్మార్గంలో తీర్చిదిద్దడంపైనే దృష్టి పెట్టాలి.
