తన సొంత తప్పును దాచిపెట్టి, భర్తపై అపనిందలు వేసి ఎవరూ విడాకులు పొందలేరని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
భర్తను వదిలేసి వెళ్లి మరొక వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్న మహిళ దాఖలు చేసిన విడాకుల అప్పీల్ పిటిషన్ను తిరస్కరిస్తూ.. న్యాయమూర్తులు జె.ఎస్. అహ్లువాలియా మరియు అనురాధ శుక్లాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
గత 2015లో వివాహమైన ఈ దంపతులకు పిల్లలు లేని నేపథ్యంలో, భార్య కోర్టును ఆశ్రయించింది. తన భర్త మద్యం సేవించి తనను వేధిస్తున్నాడని, అదనపు కట్నం కోసం హింసిస్తున్నాడని వరుస ఆరోపణలు చేసింది. అంతేకాకుండా, తనను ఇంటి నుండి గెంటివేశారని, అందుకే మూడేళ్లుగా విడిగా ఉంటున్నానని పేర్కొంటూ విడాకులు కోరింది. అయితే, భర్త తరపు న్యాయవాది వాదిస్తూ.. భార్య తన నగలతో సహా ఇల్లు వదిలి సొంతంగా పారిపోయిందని, ఆమె కనిపించడం లేదని తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని పేర్కొంటూ, తమను మళ్లీ కలిపి ఉంచాలని కోరారు.
ఈ కేసును విచారించిన హైకోర్టు.. భార్య చేసిన కట్నం వేధింపులు, గృహహింస ఆరోపణలన్నీ కేవలం నిరాధారమైనవని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఒక క్రిమినల్ కేసు నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు.. ఆ మహిళ తన భర్తను వదిలి వెళ్లిన కాలంలో, మరొక వ్యక్తితో పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు కోర్టు విచారణలో వెలుగులోకి వచ్చింది.
దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు.. హిందూ వివాహ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి తాను చేసిన తప్పును తనకు అనుకూలంగా ఉపయోగించుకుని కోర్టు ద్వారా ఉపశమనం (విడాకులు) పొందలేరని స్పష్టం చేశారు. సొంతంగా ఇల్లు వదిలి వెళ్లి, వివాహేతర సంబంధం పెట్టుకుని, ఇప్పుడు భర్తపై తప్పులు నెడుతున్న మహిళకు విడాకులు మంజూరు చేయలేమని పేర్కొంటూ.. గతంలో కుటుంబ కోర్టు (ఫ్యామిలీ కోర్ట్) ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
