ఫిన్లాండ్లో సాధారణంగా జరగాల్సిన శిక్షణా విమాన విన్యాసాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శిక్షణలో ఉన్న పైలట్లు రాడార్ ట్రాకింగ్ మ్యాప్‌లలో అసభ్యకరమైన (పురుష జననేంద్రియ) ఆకృతి కనిపించేలా విమానాలను నడిపినట్లు సమాచారం.
అసలేం జరిగింది? నివేదికల ప్రకారం, ఏప్రిల్ 13న ఫిన్నిష్ ఎయిర్ ఫోర్స్ రిజర్వ్ ఆఫీసర్ పైలట్ కోర్సు విద్యార్థులు శిక్షణా విన్యాసాలు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ఫిన్లాండ్లోని జైవాస్కిలా నగర సమీపంలోని టిక్కాకోస్కి నుండి ఉదయం 7:30 గంటలకు పలు విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఫ్లైట్ రాడార్ ట్రాకింగ్ సేవలో ఈ విమానాల మార్గాలను (Trajectories) పరిశీలించగా, కనీసం నాలుగు విమాన మార్గాలు అసభ్యకరమైన ఆకృతిని పోలి ఉన్నాయి.
వైమానిక దళం స్పందన: ఈ ఘటనలో పాల్గొన్న వారు శిక్షణ పొందుతున్న క్యాడెట్లని ఫిన్నిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (YLE) కి ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఆ విమానాలు తమకు కేటాయించిన గగనతలంలోనే ఉన్నాయని, శిక్షణా మిషన్‌లో ఇచ్చిన వ్యాయామాలనే చేశాయని, తమ మార్గం నుండి ఎక్కడా పక్కకు తప్పుకోలేదని ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.
విచారణకు ఆదేశం: ఈ ఘటనపై వైమానిక దళం విచారణకు ఆదేశించింది. “సైనికులు మంచి ప్రవర్తనను, నియమ నిబంధనలను పాటించాలని వైమానిక దళం కోరుకుంటుంది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే, వారిపై తగిన రీతిలో చర్యలు తీసుకుంటాం” అని అధికారిక ప్రకటన వెలువడింది.
గతంలోనూ ఇలాంటి ఘటనలు:
- 2023: లఫ్తాన్సా (Lufthansa) పైలట్ ఒకరు ప్యాసింజర్ విమానాన్ని ఇలాంటి ఆకృతిలోనే నడిపారు. విమానాన్ని వేరే ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించమని కోరినందుకు అసహనంతో ఆయన అలా చేసినట్లు వార్తలు వచ్చాయి.
- 2019: అమెరికా నావికాదళానికి (US Navy) చెందిన ఇద్దరు అధికారులు ఆకాశంలో ఇలాంటి ఆకృతులను గీసినందుకు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నారు. దీనిని అప్పట్లో “స్కై పెన్నిస్” (Sky Penis) అని పిలిచారు.
