ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన ఎండ, వడగాల్పులు, చెమటలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, ఈ వేసవి కాలంలో పురుషులు తమకు విపరీతంగా వేడి చేస్తోందని తరచూ చెబుతుంటారు. సాధారణంగా పురుషులకు ఎక్కువ వేడి అనిపిస్తుందని, మహిళలకు ఎక్కువ చలి వేస్తుందని జోకులు కూడా వేసుకుంటూ ఉంటారు. మరి దీని వెనుక నిజంగానే ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మహిళల్లో తక్కువ మెటబాలిక్ రేట్!
అమెరికాకు చెందిన ‘నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్’ (NCBI) నివేదిక ప్రకారం.. పురుషులతో పోలిస్తే మహిళల్లో సగటు ‘బేసల్ మెటబాలిక్ రేట్’ (BMR) తక్కువగా ఉంటుంది.
దీని అర్థం ఏంటంటే.. మహిళల శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు పురుషుల శరీరం కంటే తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది.
అంతేకాకుండా, మహిళల చేతులు, కాళ్లలో రక్తప్రసరణ (Blood Flow) కూడా కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. ఇందువల్లే పురుషులు నార్మల్‌గా ఫీలయ్యే రూమ్ టెంపరేచర్లో కూడా మహిళలకు కాస్త చలిగా అనిపిస్తుంది.
పురుషుల్లో ఎక్కువ కండరాల శాతం (Muscle Mass)
మహిళలతో పోలిస్తే పురుషులలో కండరాల శాతం (Muscle Mass) ఎక్కువగా ఉంటుంది. శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడంలో కండరాలు కీలక పాత్ర పోషిస్తాయి.
పురుషుల శరీరంలో కండరాలు ఎక్కువగా ఉండటం వల్ల వారి శరీరం ఎక్కువ వేడిని పుట్టిస్తుంది.
వీరి మెటబాలిక్ రేట్ కూడా సాధారణంగా ఎక్కువగా ఉండటం వల్ల వేడి వాతావరణాన్ని త్వరగా గ్రహిస్తారు. ఇందువల్లే చాలా మంది పురుషులు ఏసీ (AC) టెంపరేచర్‌ను తక్కువగా ఉంచడానికి ఇష్టపడతారు.
హార్మోన్ల ప్రభావం
శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో హార్మోన్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు నెలసరి చక్రం (Menstrual Cycle) సమయంలో మారుతూ ఉంటాయి. దీనివల్ల వారు ఉష్ణోగ్రతను గ్రహించే విధానంలో మార్పులు వస్తాయి. అందుకే మహిళలకు వేర్వేరు సమయాల్లో వేడి లేదా చలి తీవ్రత వేర్వేరుగా అనిపించవచ్చు.
ఇతర వ్యక్తిగత కారణాలు కూడా..
నిపుణుల విశ్లేషణ:
ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కేవలం లింగభేదం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి యొక్క బరువు, వయసు, ఫిట్నెస్ స్థాయి, ఆరోగ్య పరిస్థితి, వారు ధరించే దుస్తులు, మానసిక ఒత్తిడి మరియు చుట్టూ ఉన్న వాతావరణం వంటివి కూడా వారికి ఎంత వేడి లేదా చలి వేస్తుందనేదాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి పురుషులందరికీ ఎక్కువ వేడి తెలుస్తుందని లేదా మహిళలందరికీ ఎక్కువ చలి వేస్తుందని ఖచ్చితంగా జనరలైజ్ చేసి చెప్పలేము.

Leave a Reply