వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల శరీరంలో వచ్చే రకరకాల మార్పులను సహజమైనవేనని నిర్లక్ష్యం చేయకుండా, 40 ఏళ్ల వయసు నుండే సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే 70 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా జీవించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ‘మోవంబర్’ వంటి అవగాహనా ఉద్యమాల ద్వారా పురుషుల మానసిక ఆరోగ్యం, ప్రోస్టేట్ క్యాన్సర్‌పై బహిరంగ చర్చలు పెరుగుతున్న తరుణంలో, నఫీల్డ్ హెల్త్ సంస్థకు చెందిన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నటాలీ బార్క్లే పురుషులు ప్రతి వయసులోనూ గమనించాల్సిన ముఖ్యమైన ఆరోగ్య సూచనలను పంచుకున్నారు.
పురుషుల కండరాల ఎదుగుదలకు, లైంగిక సామర్థ్యానికి ఎంతో ముఖ్యమైన టెస్టోస్టెరాన్ హార్మోన్, 40 ఏళ్లు దాటిన తర్వాత ఏడాదికి 1 నుండి 2 శాతం వరకు తగ్గడం ప్రారంభిస్తుంది. దీనికారణంగా శరీరంలో మెటబాలిజం వేగం తగ్గి, అనవసరంగా శరీర బరువు పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి ఎక్కువ కేలరీలు ఉండే పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను మానేసి, వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన వ్యాయామాలు చేయాలి. అంతేకాకుండా, ఈ వయసులో ప్రారంభించే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలే 50, 60 ఏళ్ల వయసులో బలమైన కండరాల నిర్మాణానికి, మంచి శారీరక కదలికలకు బలమైన పునాదిగా నిలుస్తాయి.
కుటుంబంలో అధిక రక్తపోటు, మధుమేహం లేదా గుండెజబ్బుల చరిత్ర ఉన్నవారు 40 ఏళ్లలోనే తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. 50 ఏళ్లకు చేరుకున్నప్పుడు కండరాల క్షీణత వేగవంతమవ్వడంతో పాటు, కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు సమస్యలు కూడా పెరగవచ్చు. దీనివల్ల ఆహారంలో ఉప్పు, సంతృప్త కొవ్వులను తగ్గించి, మధ్యపానాన్ని అదుపులో ఉంచుకోవాలి.
అలాగే, రాత్రి వేళల్లో తరచూ మూత్రవిసర్జన రావడం వంటి ప్రోస్టేట్ గ్రంధి సమస్యల లక్షణాలు కనిపిస్తే సాయంత్రం వేళల్లో ద్రవాహారాన్ని తగ్గించి, వైద్యుల సలహాతో PSA రక్త పరీక్ష చేయించుకోవడం మంచిది. 60 ఏళ్లు దాటేటప్పుడు కీళ్ల నొప్పులు, శరీర సమతుల్యతను నియంత్రించే వ్యవస్థలో మార్పుల వల్ల అడుగు తడబడి కింద పడే ప్రమాదం పెరుగుతుంది.
దీన్ని నివారించడానికి ఈత, సైక్లింగ్ మరియు తై చీ వంటి సరళమైన బ్యాలెన్సింగ్ వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. 70 ఏళ్లకు దగ్గరవుతున్నప్పుడు వచ్చే అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి క్షీణత వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడానికి, పౌష్టికాహారంతో పాటు పజిల్స్ వంటి మెదడుకు మేత పెట్టే వ్యాయామాలలో, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలి. 40 ఏళ్ల వయసులోనే తమ ఆరోగ్యం పట్ల అవగాహనతో వ్యవహరించే పురుషులు, వృద్ధాప్యంలోనూ చురుకైన జీవనాన్ని కొనసాగించగలరు.

Leave a Reply