భారతదేశంలో క్యాన్సర్ ప్రభావంపై అవగాహన క్రమంగా పెరుగుతోంది. ఇటీవల జరిగిన ‘సెహత్ సంవాద్ 2026’ కార్యక్రమంలో వైద్య నిపుణులు క్యాన్సర్కు సంబంధించిన పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి చెందిన రేడియేషన్ ఆంకాలజీ విభాగం వైద్యుడు డాక్టర్ అభిషేక్ శంకర్ మాట్లాడుతూ.. భారతీయ పురుషుల్లో ప్రధానంగా నాలుగు రకాల క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అవి:
- నోటి క్యాన్సర్: పొగాకు, గుట్కా, పాన్ మసాలా, వక్కపొడి, మద్యపానం వంటివి దీనికి ముఖ్యమైన ప్రమాద కారకాలు.
- ఊపిరితిత్తుల క్యాన్సర్: ధూమపానం మాత్రమే కాకుండా.. వాయు కాలుష్యం, పరోక్ష ధూమపానం (ఇతరులు వదిలే పొగను పీల్చడం) వల్ల కూడా ముప్పు పెరుగుతుంది. కాబట్టి పొగతాగే వారే కాకుండా, దీర్ఘకాలంగా కాలుష్య వాతావరణంలో ఉండేవారు కూడా అప్రమత్తంగా ఉండాలి.
- కొలొరెక్టల్ (పెద్దప్రేగు-మలద్వార) క్యాన్సర్: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పీచుపదార్థాలు (ఫైబర్) తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఊబకాయం వంటివి దీని ముప్పును పెంచుతాయి.
- కడుపు క్యాన్సర్: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు ‘హెలికోబాక్టర్ పైలోరీ’ (Helicobacter pylori) ఇన్ఫెక్షన్ కూడా దీనికి ఒక కారణమని వైద్య నివేదికలు చెబుతున్నాయి.
పై అలవాట్లు లేదా కారకాలు ఉన్నంత మాత్రాన కచ్చితంగా క్యాన్సర్ వస్తుందని కాదు.. ఇవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే కారకాలు మాత్రమే.
నిర్లక్ష్యం చేయకూడని ముఖ్యమైన లక్షణాలు:
- నోట్లో చాలా రోజులుగా మానని పుండు
- స్వరంలో నిరంతర మార్పులు
- దీర్ఘకాలిక దగ్గు మరియు ఆహారం మింగడంలో ఇబ్బంది
- మలంలో రక్తం పడటం, మలవిసర్జన అలవాట్లలో ఆకస్మిక మార్పులు
- కారణం లేకుండా ఒక్కసారిగా బరువు తగ్గడం
- నిరంతర కడుపునొప్పి లేదా అజీర్తి
ఈ లక్షణాలు దీర్ఘకాలం పాటు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా పొగాకు లేదా మద్యపాన అలవాట్లు, ఊబకాయం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు ముందుజాగ్రత్తగా తమకు అవసరమైన వైద్య పరీక్షల గురించి వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం వల్ల చికిత్సను విజయవంతంగా అందించే అవకాశాలు పెరుగుతాయి.
