పూజ జరుగుతున్న ఇంట్లో హఠాత్తుగా తుపాకీ మోత..! మరుక్షణమే ముగ్గురు బలి.. 3 పిల్లలతో ఇంట్లో నక్కిన భర్త..! పిల్లలను రక్షించేందుకు 7 గంటల పాటు ఉత్కంఠభరిత ఆపరేషన్..!!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆజంగఢ్‌లోని శంభుగంజ్ గ్రామంలో మంగళవారం సాయంత్రం పూజ జరుగుతుండగా హఠాత్తుగా కాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో ఇంటి యజమాని అరవింద్ సింగ్ భార్య బబిత (32), పూజ కోసం వచ్చిన మహేంద్ర పాథక్ (60), అఖిలేష్ మిశ్రా (50) సహా ముగ్గురు మృతి చెందారు. పూజకు వచ్చిన మరో ఇద్దరు పూజారులు అదృష్టవశాత్తూ అక్కడి నుంచి తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. అరవింద్ సింగ్ తల్లి, తన సోదరుడు సునీల్ జ్ఞాపకార్థం ఈ పూజను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే, ఈ పూజ ఏర్పాట్ల విషయమై కుటుంబ సభ్యుల మధ్య ముందే విభేదాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ క్రమంలో, పూజ జరుగుతుండగా ఇంటికి వచ్చిన అరవింద్ సింగ్ అక్కడున్న పూజారులను ప్రశ్నించాడు. పూజకు సంబంధించిన వాగ్వాదంలో, పూజారుల ఆధార్ కార్డులు చూపించాలని అతను అడిగినట్లు పోలీసులు తెలిపారు. వాగ్వాదం ముదరడంతో, అరవింద్ సింగ్ తన తుపాకీతో కాల్పులు జరిపాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇందులో అతని భార్య బబిత, ఇద్దరు పూజారులు అక్కడికక్కడే మరణించారు. కాల్పులు జరగగానే అక్కడున్న మరో ఇద్దరు పూజారులు పారిపోయారు. ఆ తర్వాత అరవింద్ సింగ్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు ఘడియ పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు.

దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పిల్లలను సురక్షితంగా రక్షించడానికి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, లొంగిపోవాలని అరవింద్ సింగ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కానీ, అతను పోలీసుల విజ్ఞప్తిని వినకుండా ఇంట్లోనే ఉండిపోయినట్లు సమాచారం. ఇంతలో, లోపలి నుంచి తుపాకీ మోత వినిపించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, స్టన్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ ఉపయోగించి ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. తలుపులు బద్దలు కొట్టి పోలీసులు లోపలికి వెళ్లగా, అరవింద్ సింగ్ వారిపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడని, ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను గాయపడ్డాడని అధికారులు తెలిపారు.

ఈ కాల్పుల్లో అరవింద్ సింగ్, అతని 8 ఏళ్ల కుమారుడు శౌర్య తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరినీ రక్షించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అరవింద్ సింగ్ మృతి చెందాడు. అలాగే, తుపాకీ గాయాలైన అతని 8 ఏళ్ల కుమారుడు కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఉన్న 10 ఏళ్ల కుమార్తె పరి, 11 నెలల చిన్నారి సాన్వి అనే ఇద్దరు ఆడపిల్లలను సురక్షితంగా రక్షించి బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *