‘పూల వాన’కే తలపతి బెంబేలు.. బాంబు అనుకుని పరుగులు తీసిన విజయ్! సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం.. వెనకేసుకొస్తున్న ఫ్యాన్స్!

న్యాకుమారి: తమిళ సినీ దిగ్గజం, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ఎన్నికల ప్రచారంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. కన్యాకుమారి వీధుల్లో సైకిల్‌పై వెళ్తూ తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకుంటున్న తలపతి.. ఒక్కసారిగా భయాందోళనకు గురై సైకిల్ వదిలేసి పరుగులు తీయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అభిమాని చల్లిన పూల రెక్కలను చూసి ఆయన ఏదో ప్రమాదం పొంచి ఉందని భావించిన తీరు నెటిజన్లకు ‘మీమ్ మెటీరియల్’గా దొరికిపోయింది.

అసలేం జరిగింది?

విజయ్ తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి రోడ్డుపై ఉత్సాహంగా సైకిల్ తొక్కుతూ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. అదే సమయంలో ఒక అభిమాని ఉత్సాహంతో ఆయనపైకి పూల రెక్కలు చల్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ పూల రేకలు తనపై పడగానే విజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అది ఏదో పేలుడు పదార్థం లేదా ప్రమాదకర వస్తువు అని పొరబడ్డారేమో కానీ.. వెంటనే సైకిల్ దిగి వెనుదిరిగి తన ప్రచార వ్యాన్ వైపు పరుగులు తీశారు. సెక్యూరిటీ కూడా ఒక్కసారిగా అప్రమత్తం కావడంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది.

నెట్టింట ట్రోల్స్.. ‘ఇది సినిమా కాదు జోసెఫ్!’

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

  • “ఎంటర్టైన్‌మెంట్‌కు కొదువ లేదు” అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే..
  • “స్క్రీన్ మీద మాస్టర్.. పూల దండను చూసి బ్లాస్టర్ అనుకుని పరిగెత్తాడు ఫాస్టర్” అంటూ మరికొందరు ప్రాసలతో సెటైర్లు వేస్తున్నారు.
  • “జోసెఫ్ విజయ్.. ఇది సినిమా కాదు, వాస్తవంలోకి రా” అంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. ఈ వీడియోను కొత్త ‘మీమ్ టెంప్లేట్’గా మార్చేశారు నెటిజన్లు.
వెనకేసుకొస్తున్న అభిమానులు:

విజయ్ చర్యను నెటిజన్లు ఎగతాళి చేస్తున్నా, ఆయన అభిమానులు మాత్రం గట్టిగానే సమర్థిస్తున్నారు. గతంలో కరూర్‌లో జరిగిన కొన్ని ఘటనలు లేదా భద్రతా కారణాల దృష్ట్యా ఆయన అలా స్పందించి ఉండవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకు భద్రతా పరమైన హెచ్చరికలు ఉండి ఉంటాయని, అందుకే ఏదైనా వస్తువు తనపై పడగానే అప్రమత్తం అయ్యారని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ తన చివరి సినిమా ‘జన నాయకన్’ షూటింగ్‌లో బిజీగా ఉంటూనే, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం తన TVK పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలో ఆయన చేసే ప్రతి చిన్న పని కూడా ఇలా చర్చలకు దారితీయడం విశేషం.


Posted

in

by

Tags: