పెట్టుబడిదారులారా జాగ్రత్త! ప్రపంచంలోనే అతిపెద్ద ‘మార్కెట్ క్రాష్’ రాబోతోందా? కియోసాకి చెప్పిన ధనవంతులయ్యే సూత్రం

మధ్యప్రాచ్య దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలింది. దీని ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్ కూడా ఒడిదుడుకులకు లోనవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన హెచ్చరికలు జారీ చేశారు.

ప్రపంచం ప్రస్తుతం చరిత్రలోనే అతిపెద్ద ‘ఆర్థిక బుడగ’ (Financial Bubble) అంచున నిలబడిందని, అది ఎప్పుడైనా పగిలిపోవచ్చని ఆయన హెచ్చరించారు. అయితే, ఈ పతనం పెట్టుబడిదారులకు ‘బిలియనీర్లు’ అయ్యే గొప్ప అవకాశాన్ని ఇస్తుందని ఆయన వాదిస్తున్నారు.

మార్కెట్ కుప్పకూలడం ఖాయమా? కియోసాకి తన ‘X’ (గతంలో ట్విట్టర్) పోస్ట్‌లో.. “ఏదో ఒక చిన్న పిన్ ఈ భారీ బుడగను పగలగొడుతుంది, అప్పుడు మార్కెట్ కుప్పకూలుతుంది” అని పేర్కొన్నారు. ఈ క్రాష్ ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితమైన తేదీ చెప్పనప్పటికీ, ఆ సమయం చాలా దగ్గరలోనే ఉందని స్పష్టం చేశారు. ఏదైనా అంతర్జాతీయ సంఘటన లేదా ట్రిగర్ ఈ మహా పతనానికి కారణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

బంగారం, వెండి ధరలు ఆకాశానికి చేరుతాయా? కియోసాకి అంచనా ప్రకారం, ఈ ఆర్థిక బుడగ పగిలిన ఏడాదిలోనే విలువైన లోహాల ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయి.

  • బంగారం: ప్రస్తుతం ఔన్సు బంగారం ధర సుమారు 5,000 డాలర్లుగా ఉంది. ఏడాదిలో ఇది 35,000 డాలర్లకు చేరుతుందని, అంటే 7 రెట్లు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు.
  • వెండి: ప్రస్తుతం ఔన్సు వెండి ధర 82 డాలర్లుగా ఉంది. సంక్షోభం తర్వాత ఇది 200 డాలర్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు.

క్రిప్టోకరెన్సీలో ‘సునామీ’: డిజిటల్ కరెన్సీల గురించి కూడా ఆయన పెద్ద అంచనాలే వేశారు.

  • బిట్‌కాయిన్: ప్రస్తుతం 74,000 డాలర్ల వద్ద ఉన్న బిట్‌కాయిన్, ఏడాదిలో 7.50 లక్షల డాలర్లకు (10 రెట్లు) చేరుతుందట.
  • ఇథీరియం: ప్రస్తుతం 2,300 డాలర్ల వద్ద ఉన్న ఇథీరియం ధర నేరుగా 95,000 డాలర్లకు చేరుతుందని ఆయన జోస్యం చెప్పారు.

Posted

in

by

Tags: