న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయనే వార్తలు సామాన్యుడి నిద్రను పోగొడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేశాయి. ముఖ్యంగా ‘కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్’ తన నివేదికలో ఓటింగ్ ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 25 నుండి రూ. 28 వరకు పెరగవచ్చని అంచనా వేయడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ తన వైఖరిని స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఏమంది? ఇంధన ధరల పెంపుపై జరుగుతున్న చర్చలన్నింటినీ పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో లేదా కొన్ని నివేదికల్లో వస్తున్న ధరల పెంపు వార్తలు తప్పు అని, అవి నిరాధారమైనవని ప్రభుత్వం పేర్కొంది.
కోటక్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఏప్రిల్ 22న విడుదలైన కోటక్ నివేదిక ప్రకారం.. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. హోర్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయంతో ధరలు పెరిగాయి. దీనివల్ల భారత్ తక్కువ చమురు కొనుగోలు చేసినప్పటికీ ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. చమురు కంపెనీలపై నెలకు రూ. 270 బిలియన్ల అదనపు భారం పడుతున్నందున, ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి రూ. 28 వరకు ధరల పెంపు అవసరమని ఆ నివేదిక పేర్కొంది.
సామాన్యులకు ఊరట: ఒకవేళ నిజంగా రూ. 25-28 ధర పెరిగితే, దాని ప్రభావం కూరగాయలు, రవాణా మరియు నిత్యావసర వస్తువులపై నేరుగా పడి ధరలు ఆకాశాన్ని తాకేవి. ఏప్రిల్ 29న చివరి విడత పోలింగ్ ముగియనుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత ధరలు పెరుగుతాయని చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే, ప్రభుత్వం ప్రస్తుతానికి ధరల పెంపు ఆలోచన లేదని చెప్పడంతో ప్రజలకు పెద్ద ఊరట లభించింది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల దృష్ట్యా భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయనే దానిపై అందరి దృష్టి నెలకొంది.
