ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో జరిగిన ఒక అనాగరిక సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని మరియు సంచలనాన్ని సృష్టించింది.
ఉన్నావ్ జిల్లాకు చెందినవారు, మహారాణా వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షులు, హిందూ యువా సేన ప్రాంతీయ బాధ్యుడిగా పదవి నిర్వహిస్తున్న ధీరేంద్ర ప్రతాప్ సింగ్. ప్రభుత్వ భద్రత కలిగిన ఆయనకు చెందిన లగ్జరీ కారు ఫార్చ్యూనర్‌లోనే దుండగులు ఆయన్ని కాల్చి చంపి శవాన్ని బయట పడేసిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
గత శనివారం నాడు ఆయన అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో, ఆయన కుటుంబ సభ్యులు సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీసు స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్నో గంటల గాలింపు తర్వాత, దుబక్క ప్రాంతానికి సమీపంలో ఆయన మృతదేహం లభ్యమైంది. కారును మరియు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వహించిన ప్రాథమిక విచారణలో, ఉన్నావ్ భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చనే అనుమానం బలపడింది.
హత్యకు గురైన వ్యక్తి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, కారు డ్రైవర్ తన శత్రువులతో కుమ్మక్కై కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. మరోవైపు, పోలీసులు సరైన సమయంలో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి ఉంటే ధీరేంద్ర ప్రతాప్ సింగ్ ప్రాణాలను కాపాడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు, ఈ కుట్రకు సంబంధించిన పలు నిజాలను త్వరలోనే వెలుగులోకి తెస్తారని భావిస్తున్నారు.

Leave a Reply