సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒక మహిళ తన జీవితంలో జరిగిన ఒక వింత సంఘటనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆమె కథనం ప్రకారం, పెళ్లయి, ఒక బిడ్డ పుట్టిన తర్వాత తన భర్త తాను ‘గే’ (Gay) అని ఆమెకు నిజం చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారు విడిపోవడానికి బదులుగా, అదే ఇంట్లో కుటుంబంగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా, భర్త తన పురుష భాగస్వామిని కూడా అదే ఇంటికి తీసుకువచ్చాడు.
అసలేం జరిగింది? వీడియోలోని సమాచారం ప్రకారం, వారు పని చేసే చోట కలుసుకున్నారు, స్నేహితులయ్యారు, ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆమెను కలవకముందే అతనికి ఒక పురుష భాగస్వామి ఉన్నాడని పేర్కొంది. పెళ్లయ్యాక, ఆమె ప్రసవానంతర కుంగుబాటు (postpartum depression)తో బాధపడుతున్న సమయంలో, భర్త తాను గే అని ఆమెకు వెల్లడించాడు. ఈ నిజం తెలిసినా, వారు విడిపోకుండా ‘పార్ట్నర్లుగా’ ఉంటూనే, ఒకే కుటుంబంగా జీవించాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం వారు ఒకే ఇంటిలో వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారు. భార్య తన కుమారుడితో పై అంతస్తులో, భర్త తన పురుష భాగస్వామితో కింది అంతస్తులో నివసిస్తున్నారు. ఈ వింత బంధంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్ల స్పందన:
- కొందరు ఆమెను “చాలా ధైర్యవంతురాలు” అని మెచ్చుకుంటే, మరికొందరు ఇది భావోద్వేగపరంగా ఆ మహిళకు ఎంతటి హాని కలిగిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఒక నెటిజన్ వ్యంగ్యంగా, “భర్త బిడ్డ పుట్టిన తర్వాత తాను గే అని బాంబు పేల్చాడు. ఇప్పుడు ప్రియుడితో కింద ఫ్లోర్లో ఉంటున్నాడు. ఆమె పైన సంతోషంగా ఉన్నట్లు నటిస్తోంది. ఇది స్త్రీ శక్తికి పరాకాష్టా?” అని ప్రశ్నించారు.
- చాలా మంది నెటిజన్లు ఆ బిడ్డ పరిస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. “ఆ బిడ్డకు దేవుడే ధైర్యాన్ని ఇవ్వాలి. గే అని ఒప్పుకోవడంలో తప్పు లేదు, కానీ బిడ్డకు జన్మనివ్వాల్సిన అవసరం ఏముంది?” అని కామెంట్ చేశారు.
- మరొకరు, “ఆ వ్యక్తి తన లైంగికతను దాచిపెట్టి, ఒక మహిళను పెళ్లికి ఒప్పించి, బిడ్డను కనడానికి ఆమెను వాడుకున్నాడు” అంటూ భర్తపై తీవ్ర విమర్శలు చేశారు.
