పెళ్లి మధ్యలో ఆగిపోయిన పెళ్లికొడుకు.. వరుడి తల్లి డిమాండ్‌తో వణికిపోయిన వధువు తండ్రి! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తోంది. అయితే, నేటి కాలంలో పెళ్లిళ్లు రెండు కుటుంబాల మధ్య బంధంలా కాకుండా, లక్షల రూపాయల లావాదేవీలతో కూడిన ఒప్పందాలుగా మారుతున్నాయి. చాలా చోట్ల అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురిని భారంగా భావిస్తారనే సాకుతో, అబ్బాయి తరపు వారు అసాధ్యమైన డిమాండ్లు చేస్తున్నారు. అమ్మాయి తరపు వారు భరించగలిగితే ఇస్తారు, లేదంటే సమాజంలో పరువు పోతుందనే భయంతో సతమతమవుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఏం జరిగిందంటే.. ఆగ్రాలోని తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహం ఘనంగా జరుగుతోంది. బారాత్ వచ్చింది, ద్వారపూజ జరిగింది, జయమాల వేడుక కూడా పూర్తయింది. పెళ్లి పీటల మీదకు వచ్చిన వరుడు రెండు ఫేరాలు పూర్తి చేసుకున్నాడు. ఇంతలో, వరుడి తల్లి తన కొడుకుకు ఏదో సైగ చేయగానే వాడు ఆగిపోయాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నాక, వధువు తండ్రిని 35 లక్షల రూపాయల విలువైన ‘పజేరో’ కారు కావాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పెళ్లి కోసం దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చు చేసిన ఆ తండ్రికి, అంత మొత్తాన్ని అప్పటికప్పుడు ఇవ్వడం అసాధ్యమైంది. దాంతో ఆయన చేతులు జోడించి వేడుకున్నా, అబ్బాయి తరపు వారు ఏమాత్రం కనికరం చూపకుండా బారాత్‌ను వెనక్కి తీసుకెళ్తామని బెదిరించారు.

పంచాయతీ వరకు వెళ్లిన పంచాయితీ: ఈ వ్యవహారం గ్రామ పంచాయతీ వరకు వెళ్ళింది. వివాహం కోసం వధువు తండ్రి ఖర్చు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని పంచాయతీ తీర్పునిచ్చింది. అయితే, అబ్బాయి తరపు వారు మూడు రోజుల పాటు వారిని తిప్పుతూ, చాలా తెలివిగా వధువు కుటుంబంపైనే ఎదురు కేసు పెట్టారు. కానీ, చివరకు అసలు విషయం బయటపడింది.

న్యాయం కోరిన వధువు తండ్రి: వధువు కుటుంబ సభ్యులకు విషయం తెలియగానే, వారు అబ్బాయి తరపు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన కూతురు పెళ్లి ఆగిపోయినందుకు బాధపడినా, ఆ కట్న పిశాచుల ఇంటికి తన కూతురు వెళ్లకుండా దేవుడే కాపాడాడని వధువు తండ్రి ఊపిరి పీల్చుకున్నారు. “నా కూతురికి జరిగిన అన్యాయం మరే ఇతర ఆడపిల్లకు జరగకూడదు. బాధ్యులైన వారికి కఠిన శిక్ష పడాలి” అని ఆయన న్యాయాన్ని కోరారు.


Posted

in

by

Tags: