బాగల్‌కోట (కర్ణాటక): ఆ ఇంట్లో మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాలి. బంధుమిత్రుల సందడితో ఆ ఇల్లు కళకళలాడాలి. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ ఇంట పెళ్లి సందడి కాస్తా విషాదంగా మారింది. పెళ్లికి కేవలం 10 రోజులే సమయం ఉండగా, ఒక యువ ఇంజనీర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాగల్‌కోట జిల్లా ముధోల్ పట్టణంలో కలకలం రేపింది. ఉపాధి హామీ పథకంలో (MNREGA) అవుట్సోర్సింగ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బసవరాజ్ కుంబార్ (28) ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
అసలేం జరిగిందంటే?
ముధోల్ పట్టణంలోని కాంబ్లే గల్లీలో ఉన్న ఒక అద్దె ఇంట్లో బసవరాజ్ నివాసం ఉంటున్నారు. మంగళవారం ఆయన తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. గత ఎనిమిది నెలలుగా ఆయన ఉపాధి హామీ పథకంలో ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎంతో సౌమ్యుడిగా పేరున్న బసవరాజ్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
శుభలేఖలు పంచుతుండగానే..
అన్నింటికంటే విషాదకరమైన విషయం ఏమిటంటే, బసవరాజ్‌కు ఈ నెల (ఏప్రిల్) 28వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి ఇంకా పది పన్నెండు రోజులే గడువు ఉండటంతో బంధువులకు, స్నేహితులకు శుభలేఖలు పంచుతున్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువ ఇంజనీర్, పెళ్లి పీటలు ఎక్కకముందే పాడె ఎక్కడం ఆ కుటుంబాన్ని కుంగదీస్తోంది.
మరణానికి కారణమేంటి?
బసవరాజ్ ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పని ఒత్తిడి కారణమా? లేక వ్యక్తిగత సమస్యలేవైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ముధోల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం:
ముధోల్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. బసవరాజ్ మొబైల్ కాల్ డేటా (CDR)ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. చనిపోయే ముందు ఆయన ఎవరితో మాట్లాడారు? ఏదైనా డెత్ నోట్ రాశారా? అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
