రైతులు నెలల తరబడి కష్టపడి పంటలను పండించినా, అవి చేతికి వచ్చే సమయంలో పక్షులు, ఉడుతలు వంటి చిన్న జీవుల వల్ల నష్టం జరగడం పెద్ద సమస్యగా మారుతోంది.
దీన్ని అరికట్టడానికి నెట్లు, కంచెలు వంటి రకరకాల పద్ధతులను వాడుతుంటారు. అయితే ఒక రైతు మాత్రం తక్కువ ఖర్చుతో కూడిన వినూత్న ఉపాయాన్ని ప్రయత్నించారు.
ఆయన మార్కెట్లో కొనుగోలు చేసిన రబ్బరు నకిలీ పాములను పొలం, తోటలోని వివిధ ప్రాంతాల్లో ఉంచారు. కొన్నింటిని చెట్ల కొమ్మలపై, మరికొన్నింటిని మొక్కలు మరియు పొలం గట్ల చుట్టూ అమర్చారు. పాము రూపాన్ని చూసి భయపడి పక్షులు, ఉడుతలు ఆ ప్రాంతానికి రావనే ఉద్దేశంతోనే ఆయన ఈ ఆలోచన చేశారు.
ఈ పద్ధతిలోని ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, పెద్దగా ఖర్చు లేకుండా అమలు చేయగలగడం. అంతేకాకుండా పంటలపై రసాయనాలు వాడాల్సిన అవసరమూ ఉండదు. అయితే, ఈ నకిలీ పాములను ఒకే చోట ఎక్కువ రోజులు ఉంచితే.. అవి నిజమైన పాములు కావని పక్షులు, జంతువులు గుర్తించి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అందుకే వాటి స్థానాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం చాలా ముఖ్యం.
ఈ విధానం ప్రతి పొలంలోనూ, అన్ని రకాల పక్షులు, జంతువులపై ఒకేలా పనిచేస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి రైతులు తమ పంటకు సరిపోయే రక్షణ పద్ధతులతో పాటు ఇలాంటి నివారణ ఉపాయాలను కూడా ప్రయత్నించవచ్చు. ఈ సాధారణ రైతు చేసిన వినూత్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష దృష్టిని ఆకర్షిస్తోంది.
