అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తూర్పు సియాంగ్ జిల్లాలో ప్రతిపాదిత 11,200 మెగావాట్ల సామర్థ్యం గల ‘సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్’కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన అకస్మాత్తుగా హింసాత్మకంగా మారింది.
12 గంటల బంద్ ముగిసిన అనంతరం, పాసిఘాట్ (Pasighat) ప్రాంతంలో గుమిగూడిన ఆందోళనకారులు నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) కార్యాలయానికి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టారు. అంతేకాకుండా, అక్కడ నిలిపి ఉంచిన పోలీసు వాహనాలను తగలబెట్టడంతో పాటు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాలింగ్ మోయోంగ్ (Kaling Moyong) మరియు ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ (Ninong Ering) ఇళ్లను కూడా ధ్వంసం చేశారు.
ఈ హింసాత్మక ఘటనల్లో ఆందోళనకారులు జరిపిన రాళ్లదాడిలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ గుంపును అదుపు చేయడానికి, చెదరగొట్టడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ (బాష్పవాయువు) గోళాలు ప్రయోగించడంతో పలువురు మహిళలు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన 10 మంది సామాజిక కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, సస్పెండ్ అయిన గ్రామ పెద్దలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సర్వే పనులను వెంటనే నిలిపివేయాలని తదితర డిమాండ్లతో వివిధ స్థానిక సంఘాలు ఏకమై ఈ ఆందోళనకు పిలుపునిచ్చాయి.
సియాంగ్ నదీ పరీవాహక ప్రాంతం, గిరిజనుల జీవనాధారం, వారి భూ హక్కులపై ఈ ప్రాజెక్టు తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతోనే స్థానిక ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, నదీ పరీవాహక ప్రాంతంలో నీటిని నిల్వ చేయడానికి, నియంత్రించడానికి.. ముఖ్యంగా చైనా ప్రతిపాదించిన మెగా డ్యామ్‌కు భవిష్యత్తులో గట్టి బదులివ్వడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో అవసరమని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వివరించింది. అంతేకాకుండా, జాతీయ జల, ఇంధన భద్రత, వరద నిర్వహణను ఆధారంగా చేసుకునే ఈ ప్రాజెక్టును ప్లాన్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనులన్నీ కేవలం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి చేస్తున్న సాంకేతిక, పర్యావరణ అధ్యయనాలు మాత్రమేనని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ప్రజలు ఎలాంటి వదంతులు, నకిలీ వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో, ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించి, దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేయడంతో అరుణాచల్ ప్రదేశ్‌లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

Leave a Reply