ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బంగారు సమాధి: 6,000 ఏళ్ల నాటి నిధి; ‘వర్ణా’ అద్భుత చరిత్ర

1972లో బల్గేరియా తీర ప్రాంత నగరమైన వర్ణాలో ఒక సాధారణ నిర్మాణ పనుల సమయంలో పురావస్తు శాస్త్రవేత్తలు కలలో కూడా ఊహించని ఒక అద్భుత ఆవిష్కరణ జరిగింది. ఒక పారిశ్రామిక ప్రాంతం సమీపంలో తవ్వకాలు జరుపుతుండగా కార్మికులకు బంగారు వస్తువులతో నిండిన పురాతన సమాధులు కనిపించాయి.

పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి, దీనిని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బంగారు సమాధిగా (Varna Necropolis) గుర్తించారు. ఇది క్రీస్తు పూర్వం 4600 నుండి 4300 కాలానికి చెందినదని తేలింది. ఈ ప్రాంతంలో సుమారు 300 సమాధులను గుర్తించగా, అన్నింటిలోనూ బంగారం లభించలేదు. కేవలం 62 సమాధుల్లో మాత్రమే బంగారు హారాలు, గాజులు, పెండెంట్లు మరియు అలంకరణ వస్తువులు లభించాయి. మొత్తం మీద ఇక్కడ 6 కిలోల కంటే ఎక్కువ బంగారం లభించింది. దీని వయస్సు సుమారు 6,600 ఏళ్లుగా అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా 43వ నంబర్ సమాధిలో లభించిన నిధి అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ పూడ్చిపెట్టిన వ్యక్తి వయస్సు సుమారు 60 ఏళ్లు ఉంటుందని, ఆయన ఒక సామాజిక నాయకుడు లేదా లోహపు నిపుణుడు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆయన శరీరం చుట్టూ బంగారు ఆభరణాలతో పాటు, బంగారంతో పొదిగిన పిడి కలిగిన ఒక గొడ్డలి కూడా ఉంది. ప్రస్తుతం ఈ బంగారు వస్తువులన్నీ బల్గేరియాలోని వర్ణా పురావస్తు మ్యూజియంలో భద్రపరచబడ్డాయి.


Posted

in

by

Tags: