ఇరాన్లో ఒకవైపు క్షిపణులు నిప్పులు కురిపిస్తుంటే, మరోవైపు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఒక ‘మిస్టరీ’ టెలిఫోన్ కాల్ చర్చనీయాంశమైంది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ‘రహబర్’ (Rahbar) కు రష్యా అధ్యక్షుడు పుతిన్ తన ‘అచంచలమైన మద్దతును’ ప్రకటించిన కొద్ది గంటల్లోనే, ట్రంప్ అత్యవసరంగా పుతిన్తో ఫోన్లో మాట్లాడారు.
“ఈ హఠాత్తు ఫోన్ కాల్ ఎందుకు?” – ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. దీని వెనుక భయం ఉందని, ‘ఎలాగైనా ఈ యుద్ధం నుండి బయటపడితే చాలు’ అన్న ట్రంప్ తపనే ఇందుకు కారణమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ ‘యూ-టర్న్’ రాజకీయాలు: 1 నుండి 10 రోజుల వరకు!
యుద్ధం మొదలైనప్పటి నుండి ట్రంప్ మరియు ఆయన కేబినెట్ విడుదల చేస్తున్న ప్రకటనలను గమనిస్తే అమెరికా ఎంతటి గందరగోళంలో ఉందో అర్థమవుతుంది.
1వ రోజు: “ఇరాన్లో అధికార మార్పిడే (Regime Change) మా లక్ష్యం” అని గర్జించారు.
2వ రోజు: “చర్చలకు నేను సిద్ధం” అంటూ కొంచెం తగ్గారు.
4వ రోజు: “కుర్దిష్ దళాలు మాతో కలవాలి” అన్నారు (మరుసటి రోజే దానిని ఆయనే ఖండించారు).
6వ రోజు: హఠాత్తుగా “ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి” (Unconditional Surrender) అని హెచ్చరించారు.
10వ రోజు: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికయ్యాక, మార్కో రూబియో విడుదల చేసిన ప్రకటనలో “అధికార మార్పిడి” అనే పదమే లేదు. క్షిపణి స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యమని అమెరికా మాట మార్చింది.
“గెలిచాం… కానీ గెలవలేదు!”
పదో రోజు ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు: “అమెరికా ఈ యుద్ధంలో విజయం సాధించింది!” కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ (WSJ) కథనం ప్రకారం, ట్రంప్ సలహాదారులే “ప్రస్తుతానికి ఏదో ఒక మార్గం వెతుక్కుని (Exit Ramp) బయటపడటం బుద్ధిమంతుడి లక్షణం” అని ఆయనపై ఒత్తిడి తెస్తున్నారట.
ఇక ఇజ్రాయెల్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ చిగురుటాకులా వణికిపోయింది. శాటిలైట్ చిత్రాల్లో ఇది కనిపించకపోయినా, హీబ్రూ ట్విట్టర్ ఖాతాల్లో వైరల్ అవుతున్న వీడియోలే అందుకు సాక్ష్యం.
అసలు చిక్కు ఎక్కడ?
ట్రంప్ ఏకపక్షంగా విజయాన్ని ప్రకటించుకుని యుద్ధాన్ని ఆపేయవచ్చు. కానీ ఇరాన్ అందుకు ఒప్పుకోవాలి కదా! ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ మూడు డిమాండ్లపై పట్టుబట్టి ఉంది:
యుద్ధ విరమణ లేదు.
చర్చలు లేవు.
మా దేశ విషయాల్లో విదేశీయుల జోక్యం ఉండకూడదు.
నేడు ఉదయం కూడా ఇరాన్ తన ప్రతీకార దాడులను కొనసాగించింది. ఈ క్రమంలో ఇరాన్ను ఒప్పించి, ‘ఉభయ పక్షాల యుద్ధ విరమణ’కు (Mutual Ceasefire) అంగీకరింపజేయడానికి ఒక మధ్యవర్తి అవసరం. ఆ పని పుతిన్ తప్ప మరెవరూ చేయలేరని గ్రహించిన ట్రంప్, ఇప్పుడు పుతిన్ తలుపు తడుతున్నారు. ఇందుకోసమే ఆయన పుతిన్ను ఫోన్లో బతిమిలాడినట్లు సమాచారం.
అమెరికా ‘అహం’ మరియు ఇరాన్ ‘మొండితనం’ తలపడుతున్న ఈ యుద్ధ క్షేత్రంలో, పుతిన్ వేసే అడుగులు ఎలాంటి మలుపులు తిప్పుతాయో వేచి చూడాలి!
