కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో జరిగిన ఒక ఘటన మానవ సంబంధాల వెనుక ఉన్న వంచనను బయటపెట్టింది. నమ్మినవారే ఇంత దారుణానికి ఒడిగడతారా? అనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలేం జరిగింది? ఆ బాధితురాలు ఎవరు?
గోకాక్ ప్రాంతానికి చెందిన సమీర్ నిసార్ అహ్మద్ షేక్, అబ్దుల్ రషీద్ మాకనాదర్, మొహమ్మద్ బాలేకుంద్రి అనే ముగ్గురు వ్యక్తులు ఒక ప్రభుత్వ మహిళా అధికారితో పరిచయం పెంచుకున్నారు. తాము జర్నలిస్టులమని, యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నామని చెప్పుకుంటూ ఆమెతో స్నేహం చేశారు. కానీ ఆ స్నేహం వెనుక ఇంతటి కుట్ర ఉందని ఆమె ఊహించలేకపోయారు.
బెడ్రూమ్, బాత్రూమ్లలో రహస్య కెమెరాలు
మీడియాలో పనిచేస్తున్నారనే కారణంతో ఆమె వారిని అమితంగా నమ్మారు. అది గమనించిన ఆ ముగ్గురు, ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆమె కదలికలను గమనించేవారు. ఒకరోజు ఆమె ఇంట్లో లేని సమయంలో రహస్యంగా లోపలికి ప్రవేశించి, ఎవరూ ఊహించని నీచమైన పనికి పాల్పడ్డారు.
ఇంటిలోని బెడ్రూమ్ మరియు బాత్రూమ్లలో ఉన్న బల్బుల లోపల రహస్య కెమెరాలను అమర్చారు. ప్రతి లైటు లోపల కెమెరాలు ఉన్నాయనే విషయం తెలియక ఆ అధికారిణి యథావిధిగా తన పనులు చేసుకునేవారు.
కోటి రూపాయల డిమాండ్
కొన్ని రోజుల తర్వాత, ఆ కెమెరాల్లో రికార్డ్ చేసిన వీడియోలను నిందితులు ఆమె వాట్సాప్ నంబర్‌కు పంపారు. గుర్తు తెలియని వ్యక్తుల్లా గొంతు మార్చి ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. “ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాకూడదంటే ఒక కోటి రూపాయలు ఇవ్వాలి” అని బేరం పెట్టారు. సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న ఆ అధికారిణి ఈ బెదిరింపులతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు.
రూ. 50 లక్షల బేరం.. పోలీసుల ఎంట్రీ
చివరికి ఆ ముఠా రూ. 50 లక్షలైనా ఇవ్వాలని ఒత్తిడి చేసింది. ఇక లాభం లేదనుకున్న ఆ అధికారిణి పోలీసులను ఆశ్రయించారు. మాలమారుతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగింది. సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టగా, ఆమెకు అత్యంత సన్నిహితులే ఈ ద్రోహానికి పాల్పడ్డారని తేలింది.
నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ఒక ప్లాన్ వేశారు. డబ్బు ఇస్తామని నమ్మించి వారిని పిలిపించారు. ఆ 50 లక్షల ఆశతో వచ్చిన ఆ ముగ్గురినీ పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద లభించినవి
అరెస్ట్ చేసిన వారి నుంచి 8 మెమరీ కార్డులు, పెన్ డ్రైవ్‌లు, రహస్య కెమెరా హోల్డర్లు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఇలాంటి క్రిమినల్స్ ఇంకా ఎంతమంది మహిళలను ఇలా వేధించారోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఈ ముఠా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు.
