అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సెయింట్ జాన్స్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ ‘గ్రంబీస్’ (Grumpy’s) రెస్టారెంట్ సహ యజమాని జస్టిన్ మైఖేల్ మిల్లిగాన్, తన రెస్టారెంట్లోనే విగతజీవిగా పడి ఉన్న ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.
అమెరికా సైన్యంలో అధికారిగా పనిచేసి, ఆ తర్వాత వైద్య పరికరాల విక్రయ రంగంలో ఎన్నో విజయాలు సాధించి, చివరకు వ్యాపారవేత్తగా రాణిస్తున్న 47 ఏళ్ల ఒక సక్సెస్ ఫుల్ వ్యక్తి ఇలా అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న షెరీఫ్ విభాగం పోలీసులు, జస్టిన్ మైఖేల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇందులో బయటి వ్యక్తుల కుట్ర ఏమీ లేదని, ఇది ఆత్మహత్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరణించడానికి కొద్దిరోజుల క్రితమే, తన రెస్టారెంట్ సిబ్బందితో కలిసి నవ్వుతూ దిగిన ఫొటోను షేర్ చేస్తూ “బెస్ట్ ఎంప్లాయీస్” అంటూ గర్వంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జస్టిన్. అంతేకాకుండా, ఆయన చనిపోవడానికి ఒకరోజు ముందు స్విమ్మింగ్ పూల్ వద్ద నిల్చుని దిగిన ఫొటో ప్రస్తుతం నెటిజన్ల గుండెల్ని పిండేస్తోంది.
జస్టిన్ ఆకస్మిక మృతిపై ఆయన సన్నిహిత మిత్రులు మాట్లాడుతూ.. “నిన్న రాత్రి కూడా ఆయనతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడాం, యథావిధిగా కలిసి ప్రార్థన చేశాం.. మానసికంగా కుంగిపోయినట్లు ఆయనలో ఎలాంటి సంకేతాలూ కనిపించలేదే” అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఒక మనిషి బయటకు కనిపించే చిరునవ్వు వెనుక ఎంతటి తీవ్రమైన ఒత్తిడి, మానసిక వేదన దాగి ఉంటాయో చెప్పడానికి ఈ ఘటన ఒక చేదు నిదర్శనంగా మారింది. ఈ విషాదం తర్వాత సెయింట్ జాన్స్ ప్రాంత ప్రజలు, కస్టమర్లు రెస్టారెంట్ ముందు బారులుతీరి నివాళులర్పిస్తున్నారు. అదే సమయంలో మానసిక ఆరోగ్యం (మెంటల్ హెల్త్) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నెట్టింట గళమెత్తుతున్నారు.
