మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్ జిల్లాలో ఉన్న సవారీ మాతా ఆలయంలో 9 మరియు 10 సంవత్సరాల వయసున్న ఇద్దరు మైనర్ బాలికల పట్ల 60 ఏళ్ల వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు.
ఆలయానికి వచ్చిన ఆ బాలికలకు ప్రసాదం ఇస్తానని మాయమాటలు చెప్పి, తన పక్కన కూర్చోబెట్టుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత వారిపై లైంగిక దాడికి పాల్పడగా, తీవ్ర భయాందోళనకు గురైన ఆ బాలికలు అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి పరుగులు తీశారు. అనంతరం జరిగిన ఘోరాన్ని తమ కుటుంబ సభ్యులకు వివరించారు.
బాధిత బాలికలు చెప్పిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఆ నిందితుడు ఉన్న ప్రాంతానికి వెళ్లి, బాలికలతో అతడిని గుర్తుపట్టించారు. బాలికలు నిందితుడిని చూపించగానే, అక్కడున్న మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఆ వృద్ధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, కర్రలతో అతడిని చితకబాదుతున్న దృశ్యాలు వీడియోగా రికార్డై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో (POCSO) చట్టం మరియు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
అలాగే, పోలీసులు బాలికల నుంచి పూర్తి వివరాలను సేకరించి దర్యాప్తును ముమ్మరం చేశారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని, నేరం రుజువైతే నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply