ఢిల్లీ: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాలు నిరసనలు తెలుపుతున్నారు.
అలాగే రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని ప్రధాని నివాసం ఎదుట నిరసన చేపట్టారు. ఈ నిరసనల నడుమ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక ముఖ్యమైన పోస్ట్ చేశారు. దీని ద్వారా ఆయన ప్రస్తుతానికి రాజీనామా చేసే ఆలోచనలో లేరని స్పష్టమైంది.
దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు తన ఎక్స్ ఖాతాలో ఇలా పేర్కొన్నారు: ”ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో అలజడి సృష్టించడానికి, విద్యార్థులను రాజకీయాస్త్రాలుగా సిగ్గులేకుండా వాడుకుంటున్నారు.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా, భద్రతా నిబంధనలను ఉల్లంఘించేలా ధర్నా నిరసన కోసం ప్రధాని నివాసం వెలుపలి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన చర్చ కంటే రాజకీయ విన్యాసాలనే ఎంచుకుంది. వారి ఉద్దేశం విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం కాదు. రాజకీయ ముఖ్యాంశాల ద్వారా అలజడి సృష్టించడమే.
రాహుల్ గాంధీకి సంబంధించి ఇది విద్యార్థుల ప్రయోజనాల గురించి కాదు. ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడమే ఆయన లక్ష్యం.
నీట్ పరీక్ష గురించి చర్చించడానికి, మన యువత యొక్క ప్రతి నిజమైన ఆందోళనను పార్లమెంట్ సభలో నివృత్తి చేయడానికి మా ప్రభుత్వం 100 శాతం కట్టుబడి ఉంది. భారతీయ విద్యార్థులు రాజకీయ ప్రచారంలో కేవలం ప్రదర్శన వస్తువులుగా చూడబడటం కంటే మెరుగ్గా చూడబడటానికి అర్హులు.
అలజడికి బదులుగా నిశ్చయాన్ని, నినాదాలకు బదులుగా పరిష్కారాలను పొందడానికి వారు అర్హులు. కోపంగా ఉండటం కంటే మనం వారికోసం పనిచేయడానికి కట్టుబడి ఉన్నాము. వారికి సమాధానాలను, సంస్కరణలను, బాధ్యతాయుత ప్రవర్తనను అందించడానికి మనం కట్టుబడి ఉన్నాము. దాన్ని అందించడంలో ప్రభుత్వం పట్టుదలతో ఉంది” అని పేర్కొన్నారు.
ఇందులో ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. అంతేకాకుండా నిరసనలకు చెవియోగ్గి సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలియజేశారు. అయినప్పటికీ రాజీనామా చేయడం గురించి ఆయన ఎలాంటి ప్రస్తావనా చేయలేదు. దీనివల్ల నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతానికి రాజీనామా చేసే ఆలోచనలో లేరని స్పష్టమవుతోంది.
