“ప్రాణాలు కాపాడాల్సిన ఆంబులెన్సే ఇంత నిర్లక్ష్యమా?”.. తలుపు తెరుచుకుని స్ట్రెచర్‌తో సహా రోడ్డుపై పడిపోయిన రోగి. దిగ్భ్రాంతిలో స్థానికులు.. వైరల్ అవుతున్న భయానక వీడియో..!!!

మహారాష్ట్రలోని పూణే జిల్లా పింప్రి-చించ్‌వాడ్ ప్రాంతంలోని యశ్వంత్‌రావ్ చవాన్ మెమోరియల్ హాస్పిటల్ (YCMH)కి చెందిన ఒక అంబులెన్స్ వెళ్తున్న సమయంలో, దురదృష్టవశాత్తు గుర్తుతెలియని రోగి ఒకరు స్ట్రెచర్‌తో సహా రోడ్డుపై కిందపడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి ప్రాంగణంలోనే కదులుతున్న ఆంబులెన్స్ తలుపు సరిగ్గా మూయబడిందా లేదా భద్రతా ఏర్పాట్లలో లోపం ఉందా అనే దానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనను ఆ ప్రాంతంలోని ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అంబులెన్స్ నుండి రోగి అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడాన్ని చూసి కంగుతిన్న ప్రజలు, వెంటనే వాహనాన్ని అడ్డుకుని దాని డ్రైవర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అత్యవసర చికిత్స కోసం తీసుకెళ్లాల్సిన రోగి భద్రత విషయంలో ఇంతటి పెద్ద నిర్లక్ష్యం చూపడాన్ని ఖండిస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గుమిగూడి నిలదీయడంతో, ఆంబులెన్స్ డ్రైవర్ మరియు అక్కడకు వచ్చిన పోలీసు కానిస్టేబుల్ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు రోగి ప్రాణాలకు పెద్దగా ప్రమాదం జరగలేదని, వెంటనే ఆయనను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే, రోగి ఆరోగ్య పరిస్థితి మరియు ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై ఆసుపత్రి యాజమాన్యం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. వైద్య రవాణా సమయాల్లో పాటించాల్సిన కనీస భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ఈ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించడంతో పాటు, ఇంటర్నెట్‌లోనూ విపరీతంగా వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *