“ప్రియుడి కోసం కేటీఎం బైక్!”.. తండ్రి స్నేహితుడి ఇంట్లోనే 9 తులాల బంగారం చోరీ: కాలేజీ యువతి చేసిన ఘరానా మోసం..!!

కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చి ప్రాంతానికి చెందిన ఓ కళాశాల విద్యార్థిని, తన ప్రియుడికి అత్యంత ఖరీదైన కేటీఎం (KTM) బైక్ కానుకగా ఇవ్వాలని ఆశపడింది.

దీని కోసం పక్కాగా ప్లాన్ వేసిన 19 ఏళ్ల విద్యార్థిని ఆర్. జాయ్ ప్రిన్సి, ఆగస్టు 16న తన తండ్రి స్నేహితుడైన తమిళ్‌వాణన్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఎవరూ గమనించని సమయంలో, వార్డ్‌రోబ్‌లో భద్రపరిచిన 9 సవర్ల (దాదాపు 72 గ్రాములు/9 తులాలు) బంగారు ఆభరణాలను గుట్టుచప్పుడు కాకుండా దొంగిలించింది.

దొంగిలించిన ఆ నగలను పొల్లాచ్చిలోని ఓ ప్రముఖ నగల దుకాణంలో విక్రయించి సుమారు ₹2.5 లక్షలు తీసుకుంది. ఆ డబ్బుతో తన ప్రియుడు జనగన్ శివాకు ఎంతో ఇష్టమైన సరికొత్త కేటీఎం బైక్‌ను కొని బహుమతిగా ఇచ్చింది. బైక్ కొన్న ఆనందంలో ఆ జంట షోరూమ్‌లో బైక్ డెలివరీ తీసుకుంటూ దర్జాగా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

మరోవైపు ఇంట్లో ఉండాల్సిన 9 సవర్ల నగలు కనిపించకపోవడంతో లబోదిబోమన్న బాధితుడు తమిళ్‌వాణన్, పొల్లాచ్చి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసుల కంట.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ బైక్ షోరూమ్ వీడియో పడింది. వెంటనే యువతి జాయ్ ప్రిన్సిని అదుపులోకి తీసుకుని విచారించగా, తానే ఆ నగలను దొంగిలించినట్లు నేరం ఒప్పుకుంది.

దీంతో యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోయంబత్తూరు మహిళా జైలుకు తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు ముమ్మరం చేయగా, ప్రియురాలు అరెస్టయిన విషయం తెలుసుకుని పరారైన ప్రియుడు జనగన్ శివా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రియుడికి బైక్ కొనివ్వబోయి కటకటాలపాలైన ఈ కాలేజీ అమ్మాయి ఉదంతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *