ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో గత ఏడాది భిన్న కులాల ప్రేమ (కులంతర వివాహం) కారణంగా సక్షమ్ తాడే అనే యువకుడు గౌరవ హత్యకు గురయ్యాడు. ఆయన మరణం తర్వాత కూడా తన ప్రేమపై స్థిరంగా ఉన్న ఆంచల్ మామిత్వార్ అనే యువతి, సక్షమ్ భౌతికకాయానికి పూలమాలలు వేసి పెళ్లి చేసుకుని, అతని ఇంట్లోనే కోడలిగా అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా అప్పట్లో పెను సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఇప్పుడు ఒక ఊహించని మలుపు చోటుచేసుకుంది.
ఆంచల్ తాజాగా తన అత్తగారింటి నుండి బయటకు వచ్చేసి, తన దివంగత ప్రియుడి సోదరుడిపై అత్యంత తీవ్రమైన లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేసింది. సక్షమ్ తమ్ముడు తనకు నిరంతరం లైంగిక వేధింపులు గురిచేశాడని, అతని చూపు తనపై తప్పుగా ఉండేదని ఆంచల్ కన్నీరుమున్నీరవుతూ మీడియాకు వెల్లడించింది.
కుటుంబ సభ్యులు నమ్మలేదు:
ఈ విషయమై ఆంచల్ మరింత మాట్లాడుతూ.. “నేను ఎంతో నమ్మకంతో, ఆశలతో ఆ ఇంటికి కోడలిగా వెళ్లాను. కానీ, సక్షమ్ తమ్ముడు నాతో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. ఈ విషయమై అతని తల్లి మరియు కుటుంబ సభ్యులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు నన్ను నమ్మలేదు. దీనివల్ల భవిష్యత్తులో నా ప్రాణానికి లేదా నా శీలానికి ముప్పు వాటిల్లవచ్చని భయపడి, పోలీసుల రక్షణ మరియు అనుమతితో ఆ ఇంటి నుండి బయటకు వచ్చేశాను. ప్రస్తుతం బంధువుల ఇంట్లో ఉంటున్నాను” అని పేర్కొంది.
గత ఏడాది నవంబర్ నెలలో ఆంచల్ తండ్రి, సోదరుడు కలిసి సక్షమ్ను దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు అత్తగారింటి వారి వేధింపుల కారణంగా ఆంచల్ ఇల్లు వదిలి బయటకు రావడం మహారాష్ట్రలో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

Leave a Reply