సింగపూర్లో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త చందర్ అగర్వాల్, తన మాజీ ప్రియురాలు ఫెలిసియా లీ కోసం ఖర్చు చేసిన దాదాపు 4,68,090 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ₹3.5 కోట్లు) తిరిగి ఇప్పించాలంటూ వేసిన కేసులో చుక్కెదురైంది.
డిసెంబర్ 2023లో వారిద్దరూ విడిపోయిన తర్వాత, తాను ఆమె కోసం చేసిన ఖర్చులు బహుమతులు కావని, కేవలం అప్పుగా ఇచ్చినవేనని అగర్వాల్ కోర్టులో వాదించారు.
అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం… మాజీ ప్రియురాలి వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు ద్వారా దాదాపు 1.5 లక్షల సింగపూర్ డాలర్లు, మరో కార్డు ద్వారా సుమారు 31,000 డాలర్లు, అలాగే ఇన్సూరెన్స్, విదేశీ ప్రయాణాలు, లగ్జరీ వస్తువుల కొనుగోళ్ల కోసం ఆయన పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. వీటిలో హెర్మేస్, డియోర్, ప్రాడా వంటి విలాసవంతమైన బ్రాండ్ల వస్తువులు కూడా ఉన్నట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు.
అయితే ఫెలిసియా లీ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ మొత్తమంతా కేవలం ప్రేమ, ఆప్యాయతలతో ఇచ్చిన బహుమతులే తప్ప, ఎన్నడూ రుణం రూపంలో తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ప్రారంభం కావడానికి ముందే అగర్వాల్ ఆమెకు ఖరీదైన బహుమతులు, విదేశీ పర్యటనలు స్పాన్సర్ చేసిన విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యంగా, తీసుకున్న డబ్బును ఎలా తిరిగి చెల్లించాలని ఆమె అడిగినప్పుడు, అగర్వాల్ “తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు” అనే ఉద్దేశంతో బదులిచ్చిన అంశాన్ని కోర్టు ప్రస్తావించింది.
ఈ కేసును విచారించిన సింగపూర్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి లీ సియు కిన్, ఆ మొత్తాలను ఆమెకు కానుకలుగానే అందించినట్లు తీర్పు వెలువరించారు. అవి అప్పుగా ఇచ్చినవని నిరూపించేందుకు సరైన ఆధారాలు గానీ, ఫెలిసియా వాటిని తిరిగి చెల్లిస్తానని అంగీకరించినట్లు తెలిపే స్పష్టమైన పత్రాలు గానీ అగర్వాల్ సమర్పించలేకపోయారని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో డబ్బును తిరిగి ఇప్పించాలన్న ఆయన అభ్యర్థనను న్యాయస్థానం కొట్టివేసింది.
