భారతీయ రైల్వేల ఆధునికతకు, వేగానికి ప్రతీకగా నిలుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, భారతీయ ప్రజల నుంచి విశేష స్పందన పొందుతూ నడుస్తున్నాయి.
అత్యాధునిక సదుపాయాలు, సౌకర్యవంతమైన సీటింగ్, పరిశుభ్రమైన వాతావరణం వందేభారత్ రైళ్ల ప్రధాన గుర్తింపుగా ప్రచారం చేయబడుతున్నాయి.
కానీ, అలాంటి ప్రీమియం హోదా కలిగిన ఒక వందేభారత్ రైలును అత్యంత దారుణంగా, అసహ్యకరమైన స్థితిలో నిర్వహిస్తున్నారంటూ కొన్ని దిగ్భ్రాంతికరమైన ఫోటోలు ఇంటర్నెట్లో విడుదలై.. ప్రయాణికుల్లో, సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
వందేభారత్ రైలులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు, తాను ప్రయాణించిన రైలు లోపలి దృశ్యాలను, మరుగుదొడ్డి దయనీయ స్థితిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ ఫోటోలలో.. మరుగుదొడ్డి గోడల పెచ్చులు ఊడిపోయి, పైపులు, గోడలు తుప్పు పట్టి, సరైన నిర్వహణ లేక అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో కనిపిస్తున్నాయి.
అంతేకాకుండా, రైలు లోపలి భాగంలో కూడా చెత్తాచెదారం పడి ఉండి అపరిశుభ్రంగా ఉండటం స్పష్టంగా తెలుస్తోంది. “భారతదేశంలోని అత్యంత అసహ్యకరమైన వందేభారత్ రైళ్లలో ఇది కూడా ఒకటి” అనే క్యాప్షన్‌తో పంచుకున్న ఈ ఫోటోలు.. వందేభారత్ రైలుకున్న లగ్జరీ ఇమేజ్ను బద్దలు కొట్టేలా ఉన్నాయి.
అధిక ఛార్జీలు చెల్లించి లగ్జరీ ప్రయాణాన్ని ఆశించే ప్రయాణికులకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంపై పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. “కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంపై చూపే ఆసక్తిని, నడుస్తున్న రైళ్లను సరిగ్గా నిర్వహించడంలోనూ రైల్వే యంత్రాంగం చూపాలి” అని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
అదే సమయంలో, రైళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రయాణికుల బాధ్యత కూడా అనే వాదన ఒకవైపు వినిపిస్తున్నప్పటికీ.. తుప్పు పట్టిన గోడలు, సరైన నిర్వహణ లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ప్రయాణికులు ఎత్తిచూపుతున్నారు.
ఈ నేపథ్యంలో వందేభారత్ రైలు యొక్క ఈ దయనీయ స్థితిపై రైల్వే అధికారులు తక్షణమే దృష్టి సారించి, నిర్వహణ పనులను మెరుగుపరచాలన్నదే అందరి ప్రధాన డిమాండ్‌గా ఉంది.

Leave a Reply