ప్రేమ లేదు.. లక్షల్లో మోసం.. ఉన్నట్టుండి మాయమవుతున్న పెళ్లికూతుళ్లు.. చైనా పురుషులకు ఎదురవుతున్న ఘోరం.. రంగంలోకి దిగి కఠిన ఆంక్షలు విధించిన చైనా ప్రభుత్వం..!!

చైనా, పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న అక్రమ అంతర్జాతీయ వివాహాలు, మ్యారేజ్ బ్రోకర్ల (ఏజెంట్ల) ఆర్థిక మోసాలపై చైనా ప్రభుత్వం తన పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

విదేశీ యువతులను, ముఖ్యంగా పాకిస్తాన్‌కు చెందిన మహిళలను పెళ్లి చేసుకోవద్దని చైనా స్థానిక యంత్రాంగం, పోలీస్ శాఖ తమ దేశ పౌరులకు స్పష్టం చేశాయి.

ఇలాంటి పెళ్లిళ్లు ప్రేమ, అనుబంధంతో జరిగేవి కావని.. కేవలం డబ్బు కోసమే వ్యాపార ధోరణితో జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల ఎంతో మంది చైనా పురుషులు తీవ్ర మోసాలకు గురవుతూ పెద్ద ఎత్తున చట్టపరమైన చిక్కుల్లో పడుతున్నారని వెల్లడించారు.

చైనాకు చెందిన ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం ప్రకారం.. నిరుపేద యువతులను, పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న పురుషులను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న ఏజెంట్ ముఠాలు లక్షలాది రూపాయలు దండుకుంటున్నాయి. పెళ్లయిన కొద్ది రోజులకే వధువులు డబ్బు, నగల మూటలతో మాయమవడం లేదా భర్తలపై తప్పుడు కేసులు పెట్టడం నిత్యకృత్యంగా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో వాణిజ్య ప్రాతిపదికన, ఏజెంట్ల ద్వారా సాగే అంతర్జాతీయ వివాహాలపై చైనా ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా వివాహాలు చేసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఒకవేళ ఇలాంటి అక్రమ పెళ్లిళ్లు బయటపడితే, మోసం మరియు కుట్ర కింద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, నకిలీ పత్రాల ద్వారా దేశంలోకి ప్రవేశించే విదేశీ యువతులపై ఇమిగ్రేషన్ చట్టం కింద చర్యలు తీసుకుని, వారిని అరెస్టు చేసి స్వదేశానికి తిప్పి పంపుతామని తేల్చిచెప్పింది.

2018లో పాకిస్తాన్ యువతులను వివాహం చేసుకున్న చైనా పురుషుల సంఖ్య 120 కాగా, 2020 నాటికి అది 600 దాటింది. ఆ తర్వాత మానవ అక్రమ రవాణా, బలవంతపు వివాహాల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఈ వివాహాలకు సంబంధించిన అధికారిక గణాంకాలను విడుదల చేయడాన్ని చైనా నిలిపివేసింది.

ఇటీవల పాకిస్తాన్‌లోనూ ఒక మైనర్ బాలికను మోసపూరితంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిన చైనా దేశస్థుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా, పౌరులు కేవలం చట్టబద్ధమైన మార్గాల ద్వారానే వివాహాలు చేసుకోవాలని చైనా ప్రభుత్వం గట్టిగా విజ్ఞప్తి చేసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *