ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో, దుర్గా పూజ వేడుకల అనంతరం ప్రొజెక్టర్‌పై సినిమా చూస్తున్న గ్రామస్తులపైకి వేగంగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
బలరాంపూర్ జిల్లా కొత్వాలి దేహాత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్హా గ్రామంలో, నవరాత్రుల సందర్భంగా ఆలయం సమీపంలో తెర ఏర్పాటు చేసి భక్తి సినిమాలు, భజనలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. శనివారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో హారతి కార్యక్రమం ముగిసిన తర్వాత, గ్రామస్తులు రోడ్డు పక్కన వేసిన టెంట్లో ప్రొజెక్టర్‌పై ప్రసారమవుతున్న వీడియోలను చూస్తున్నారు.
ఆ సమయంలో గౌరా రోడ్డు వైపు నుండి అతివేగంగా వచ్చిన ఫోర్డ్ కారు నియంత్రణ కోల్పోయి నేరుగా టెంట్‌లోకి దూసుకెళ్లి, అక్కడ కూర్చున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో పటేశ్వరి ప్రసాద్ (42), మనోజ్ సింగ్ (51), గణేష్ పాండే (45) అనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఛేదిరామ్ (50), గోబరామ్ (31), డబ్లూ (37), ముఖేష్ తివారీ (30) అనే నలుగురిని మెరుగైన చికిత్స కోసం బహ్రైచ్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ఘటన జరిగిన గంట వ్యవధిలోనే కారుతో సహా అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంతో ఆ గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.

Leave a Reply