ప్లాస్టిక్ నుండి వజ్రాలను తయారు చేయవచ్చా? ఇప్పటివరకు వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్న ఈ ప్రశ్నకు జర్మనీ శాస్త్రవేత్తలు కొత్త పరిశోధన ద్వారా సమాధానం కనుగొన్నారు.
ప్లాస్టిక్‌పై శక్తివంతమైన లేజర్‌ను ప్రయోగించి, అతి చిన్న వజ్రపు తులను (నానో డైమండ్స్) సృష్టించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన జర్మనీలోని హెల్మ్హోల్ట్జ్-సెంట్్రమ్ డ్రెస్డెన్-రోసెండార్ఫ్ రీసెర్చ్ సెంటర్ మరియు రోస్టాక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ పరిశోధన వెనుక ప్రధాన కారణం అంతరిక్షంలో ఉన్న నెప్ట్యూన్, యురేనస్ వంటి గ్రహాల అంతర్భాగంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడమే. ఈ గ్రహాల లోపల అత్యధిక ఉష్ణోగ్రత, భూ వాతావరణ పీడనం కంటే అనేక రెట్లు ఎక్కువ పీడనం ఉంటుందని భావిస్తున్నారు. ఇటువంటి కఠినమైన వాతావరణంలో కార్బన్ అణువులు కలిసిపోయి వజ్రాలుగా మారవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ వాతావరణాన్ని ప్రయోగశాలలో పునఃసృష్టించడం కోసం, కార్బన్‌తో కూడిన ప్లాస్టిక్ పదార్థంపై శక్తివంతమైన లేజర్‌ను ప్రయోగించారు. దీనివల్ల ఏర్పడిన అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనం కారణంగా, ప్లాస్టిక్‌లోని కార్బన్ అణువులు వజ్రపు నిర్మాణాన్ని సంతరించుకునే అనుకూల వాతావరణం ఏర్పడింది. దీని ద్వారా అత్యంత సూక్ష్మ పరిమాణంలో నానో వజ్రాలు తయారైనట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ప్రయోగం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ సమీపంలో ఉన్న ఎక్స్‌స్ట్రీమ్ లైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ELI) లేజర్ ల్యాబ్‌లో నిర్వహించబడింది.
ఈ పరిశోధనలో తయారైనవి సాధారణంగా ధరించే పెద్ద వజ్రాలు కావు; అతి సూక్ష్మమైన నానో వజ్రాలు. వాటిని సృష్టించడం మాత్రమే కాకుండా, ప్రయోగ సమయంలో వాటిని సంరక్షించి పరిశోధించడం కూడా శాస్త్రవేత్తలకు ఒక ముఖ్యమైన సవాలుగా మారింది. ఈ సాంకేతికత భవిష్యత్తులో నానో టెక్నాలజీ, శాస్త్రీయ పరిశోధనలు మరియు కొన్ని పారిశ్రామిక అవసరాలకు దోహదపడవచ్చు. అయితే, ప్లాస్టిక్ నుండి వాణిజ్యపరంగా వజ్రాలను తయారు చేయడం సాధ్యమైపోయిందని చెప్పడానికి ఇంకా మరింత పరిశోధనలు అవసరం.

Leave a Reply