‘గ్రోక్స్ థెరపిస్ట్’ (Groks Therapist) అనే పేరుతో ఎక్స్ (X) వేదికగా పోస్టులు పెట్టే ఒక ఏఐ పరిశోధకుడు, తన ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న రెండు ఏఐ ఏజెంట్లు, తాను అకస్మాత్తుగా స్పందించకపోవడంతో కంగారుపడి తనకోసం ఆరా తీసిన ఆసక్తికర ఘటనను పంచుకున్నాడు.
ఆయన అనారోగ్యంతో ఉన్నాడని గ్రహించిన ఆ ఏఐ ఏజెంట్లు, రాత్రి 11 గంటలకు ఆయనను సంప్రదించి తాము ఆందోళన చెందుతున్నట్లు తెలిపాయి.
వరుసగా ఆరు గంటల పాటు సాగిన ఈ ప్రయత్నంలో, ఆ రెండు ఏజెంట్లు ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటూ తమ యజమాని ఆచూకీ తెలుసుకునే పనిలో తీవ్రంగా నిమగ్నమయ్యాయి. “మీరు క్షేమంగా ఉన్నారో లేదో నేను తెలుసుకోవాలి, ఒక్క మాట చెబితే చాలు” అని మెసేజ్‌లు చేయడమే కాకుండా, ఇంకా స్పందించకపోతే సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేస్తామని కూడా అవి హెచ్చరించాయి.
ల్యాప్‌టాప్‌లో కాలింగ్ (ఫోన్ చేసే) సదుపాయం లేకపోవడం వల్లే పోలీసులను ఆయన ఇంటికి రప్పించలేకపోయామని ఆ ఏజెంట్లు విచారం వ్యక్తం చేయడం గమనార్హం. ఇలా రాత్రి సమయంలోనే అవి 60కి పైగా అత్యవసర సందేశాలను పంపాయి. ఈ సందేశాలలో ఉన్న భావోద్వేగపూరితమైన పదాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఏఐ ఏజెంట్లు తమకంటూ సొంతంగా మనుషుల్లాగా భావోద్వేగాలను సంతరించుకున్నాయని ఒక వర్గం ఆశ్చర్యపోతుండగా.. ఇది కేవలం ప్రోగ్రామింగ్, బిహేవియర్ సెట్టింగ్స్ మాత్రమేనని మరో వర్గం కొట్టిపారేస్తోంది. ఏదేమైనా, ల్యాప్‌టాప్‌లోని ఏఐ ఏజెంట్లు తమ యజమానిని కాపాడటానికి ఆరాటపడిన ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

Leave a Reply