ఇటీవలి కాలంలో సాయంత్రం వేళ స్నాక్స్ (Evening Snacks) అంటే చాలా మంది పిజ్జా, బర్గర్, బజ్జీలు, షవర్మా వంటి అనారోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇవన్నీ నిశ్శబ్దంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే పూర్వీకులు సాయంత్రం వేళ కూడా పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్నే తీసుకునేవారు. ఆ జాబితాలో అలసందలు అత్యంత ముఖ్యమైనవి.
ఉడకబెట్టిన అలసందలను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయి. వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అలసందల్లో ఉండే పోషకాలు:
జీ న్యూస్ నివేదిక ప్రకారం, అలసందల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, సి, కె, బి-కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
అలసందలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
- జీర్ణక్రియ మెరుగుదల: అలసందల్లో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇది అజీర్తి, అసిడిటీ, గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
- బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో అలసందలను చేర్చుకోవడం మంచిది. వీటిని తింటే కడుపు నిండుగా అనిపించి, ఎక్కువ సేపు ఆకలి వేయదు.
- గుండె ఆరోగ్యం: ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులను తొలగించి, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
- శాకాహారులకు మంచి ప్రోటీన్: మాంసాహారం తినని వారికి అలసందలు ఒక గొప్ప ప్రత్యామ్నాయం. ఒక కప్పు అలసందల్లో సుమారు 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల పుష్టికి, శారీరక శక్తికి చాలా అవసరం.
- డయాబెటిస్ నియంత్రణ: అలసందల గ్లైసెమిక్ ఇండెక్స్ (Glycemic Index) తక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
- గర్భిణీ స్త్రీలకు మేలు: వీటిలో విటమిన్ బి9 (ఫోలేట్) సమృద్ధిగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ఎంతో అవసరం. గర్భంలోని శిశువు ఎదుగుదలకు, రక్తహీనతను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
- క్యాన్సర్ నివారణ: అలసందల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించి, క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో తోడ్పడతాయి.
