మహారాష్ట్రలోని కళ్యాణ్ పరిధిలో గల గోవిందవాడి బైపాస్ రోడ్డులో ఒక క్యాబ్ డ్రైవర్‌పై తప్పుడు లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరించి రూ.10,000 వసూలు చేసేందుకు యత్నించిన ఇద్దరు మహిళల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఘటన జరిగిన రోజున సచిన్ షిండే అనే ట్యాక్సీ డ్రైవర్‌ను అడ్డగించిన ఇద్దరు మహిళలు, తమను భివాండికి తీసుకెళ్లాలని కోరారు. అయితే తాను కోన్ గ్రామం వరకే వెళ్తానని డ్రైవర్ స్పష్టం చేసినప్పటికీ, ఆ మహిళలు బలవంతంగా కారు ఎక్కారు.
కారు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆ మహిళలు డ్రైవర్ వద్ద రూ.10,000 డబ్బులు డిమాండ్ చేశారు. దానికి డ్రైవర్ నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ మహిళలు, తమ బట్టలను తామే చింపుకుని అత్యాచారం తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరింపులకు దిగారు.
వారి బెదిరింపులకు ఏమాత్రం లొంగని డ్రైవర్ సచిన్, వెంటనే చాకచక్యంగా పోలీసులకు సమాచారం అందిస్తూ కారును నేరుగా పోలీస్ స్టేషన్ వైపు మళ్లించాడు. దుర్గాడి వంతెన దాటిన తర్వాత ఎదురుగా వచ్చిన పోలీస్ వాహనాన్ని చూసిన ఆ ఇద్దరు మహిళలు భయాందోళనకు గురై, కదులుతున్న కారు నుంచే కిందికి దూకి అక్కడికక్కడే పరారయ్యారు.
నడుస్తున్న కారులోనే ఆ మహిళలు డ్రైవర్‌ను బూతులు తిడుతూ, దాడికి యత్నించిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి. క్యాబ్ డ్రైవర్లను టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ తరహా బ్లాక్‌మెయిలింగ్ దందా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.

Leave a Reply