వియత్నాంలోని హో చి మిన్ నగర పరిధి చుంగ్ ఆన్ కమ్యూన్లో ఉన్న ఓ పాఠశాలలో, సెప్టెంబర్ 4న 15 ఏళ్ల విద్యార్థి పదునైన ఆయుధంతో తోటి విద్యార్థులపై దాడి చేసి ఐదుగురిని గాయపరిచిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఘటన జరిగిన రోజు పాఠశాలలో యథావిధిగా తరగతులు జరుగుతుండగా, 15 ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా తాను దాచిపెట్టుకున్న ఆయుధాన్ని బయటకు తీసి తోటి విద్యార్థులపై దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన ఐదుగురు విద్యార్థులను పాఠశాల సిబ్బంది వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పాఠశాల భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని దాడికి పాల్పడిన విద్యార్థిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, దాడికి తెగబడిన ఆ విద్యార్థి గత కొంతకాలంగా తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడని వెల్లడైంది. అతడు “తీవ్ర మానసిక ఒత్తిడి ప్రతిచర్య, ప్రవర్తనా లోపాలు” (Severe stress reaction & adjustment disorder with mixed disturbance of emotions and conduct) అనే సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఇటీవల కాలంలో అతడి ప్రవర్తన, భావోద్వేగాలు తీవ్ర అస్థిరంగా మారినట్లు అధికారులు గుర్తించారు.
దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులకు మరో విస్తుపోయే నిజం తెలిసింది. ఆ విద్యార్థి విదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని ప్రమాదకరమైన గ్రూపుల్లో చేరి, నిరంతరం హింసాత్మక, తీవ్రవాద ధోరణి కలిగిన కంటెంట్‌ను చూసేవాడని గుర్తించారు. ఆ విధ్వంసకర ఆన్లైన్ వీడియోలే అతడి మనసును విషపూరితం చేసి, తోటివారిపై ఇలా పాశవికంగా దాడి ఎలా చేయాలో ప్రేరేపించాయని అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఎలాంటి వారితో కనెక్ట్ అవుతున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనించాలని పోలీసులు సూచించారు. పిల్లల్లో మానసిక ఒత్తిడి, వింత ప్రవర్తన లేదా హింసాత్మక కంటెంట్‌కు బానిసలయ్యే లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అప్రమత్తమై పాఠశాల యాజమాన్యానికి సమాచారమివ్వడంతో పాటు, నిపుణుల ద్వారా సకాలంలో మానసిక కౌన్సిలింగ్ అందించాలని హెచ్చరించారు.

Leave a Reply