బంగారాన్ని ఇప్పుడు కొనవచ్చా? లేక మరికొంత కాలం వేచి చూడాలా? ఆనంద్ శ్రీనివాసన్ సూటి వివరణ

బంగారం ధరలు వరుసగా తగ్గుతున్న నేపథ్యంలో, ఇప్పుడు కొనడం మంచిదా లేక ఇంకా తగ్గుతుందేమో అని వేచి చూడాలా? ఇదే ఇప్పుడు సామాన్యులందరి ప్రధాన ప్రశ్న. ఈ పరిస్థితుల్లో ఎవరు బంగారం కొనాలి, నిర్ణయం ఎలా తీసుకోవాలి అనే అంశంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు ఆనంద్ శ్రీనివాసన్ వివరించారు.

గత నెల రోజులుగా బంగారం ధరలు నిలకడగా తగ్గుతున్నాయి. గత కొన్నేళ్లుగా కేవలం ధరల పెరుగుదలనే చూసిన ప్రజలకు ఈ తగ్గుదల పెద్ద ఊరటనిస్తోంది. ఈ క్రమంలో బంగారం కొనాలనుకునే వారు షోరూమ్‌లకు పరుగులు తీస్తున్నారు.

ఆనంద్ శ్రీనివాసన్ ఏమంటున్నారు?
తమ వద్ద ఉన్న బంగారాన్ని కేవలం ఏడాది కాలం మాత్రమే ఉంచుకోవాలనుకునే వారు ఇప్పుడు కొనవచ్చా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. “ఒక్క ఏడాది గురించి ఏమీ చెప్పలేం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం మరో ఆరు నెలలు సాగితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేం. కాబట్టి ఏడాది కాలం కోసం చూసే వారికి నేను సలహా ఇవ్వలేను. కానీ, 3 ఏళ్ల పాటు బంగారాన్ని అట్టిపెట్టుకోగలము అనుకునే వారు ధైర్యంగా ఇప్పుడున్న రేటుకు కొనవచ్చు” అని చెప్పారు.

లాకర్లో దాచుకునే వారికి..
బంగారాన్ని కొని లాకర్లో పడేసి, దాని గురించి అస్సలు ఆలోచించని వారు ఏం చేయాలి? అనే దానికి ఆయన సమాధానమిస్తూ.. “వారు నిరభ్యంతరంగా కొనవచ్చు. కొందరు నేను గతంలో గ్రాము ₹5,000 – ₹6,000 ఉన్నప్పుడు కొన్నాను, ఇప్పుడు ₹13,000 పెట్టి కొనాలా? అని అడుగుతున్నారు. ఇప్పుడు ధర ఎక్కువ అని బాధపడేవారు, రేపు గ్రాము ₹20,000 అయినప్పుడు కొనాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.

సింపుల్ లాజిక్
“నేను ఒకటే సింపుల్ విషయం చెబుతాను.. మీకు అవసరమా? లేదా? అనేది చూసుకోండి. అవసరమైతే కొనండి, లేకపోతే వద్దు. మీ దగ్గర ఉన్న బంగారం మీ కుటుంబానికి తగినంత ఆర్థిక భద్రత ఇస్తుందా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకోండి. మీ తర్వాతి తరానికి ఇవ్వాలనుకుంటే ఇప్పుడే కొనండి. లేదంటే మరో 10 ఏళ్ల తర్వాత గ్రాముకు ₹30,000 నుండి ₹35,000 వరకు పెట్టి కొనాల్సి ఉంటుంది” అని ఆయన వివరించారు.

ఇంట్లో పెళ్లి ఉందా?
“బంగారం కొనండి అని చెప్పడం నా పని కాదు. కానీ ఐదేళ్లలో బంగారం ధర ₹20,000 దాటుతుందని నేను భావిస్తున్నాను. ధరలు ఎప్పుడు కనిష్ట స్థాయికి చేరుతాయో ఎవరూ చెప్పలేరు. కాబట్టి ధర తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం కొనడమే సరైన పద్ధతి. మీ ఇంట్లో ఏడాది తర్వాత పెళ్లి ఉన్నా, పదేళ్ల తర్వాత పెళ్లి ఉన్నా.. ఇప్పుడే బంగారం కొనడం ఉత్తమం” అని ఆయన సూచించారు.


Posted

in

by

Tags: