దక్షిణ-తూర్పు బంగ్లాదేశ్లో అదృశ్యమైన ఒక హిందూ దేవాలయ సంరక్షకుడు, మూడు రోజుల తర్వాత శవమై కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. 40 ఏళ్ల నయన్ సాధు మృతదేహం తన గ్రామానికి సమీపంలోని కొండ ప్రాంతంలో ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించినట్లు పోలీసులు తెలిపారు.
ఘటన నేపథ్యం: దర్యాప్తు అధికారుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 19 సాయంత్రం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దోహజారి ప్రాంతంలోని నివాసం నుండి సాధును తీసుకువెళ్లారు. అప్పటి నుండి అతను కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 19నే అతని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. చివరకు గ్రామ శివార్లలో మృతదేహం లభించింది. అప్పటికే మృతదేహం కుళ్ళిపోవడం ప్రారంభమైందని పోలీసులు పేర్కొన్నారు.
హత్యనా లేక ఆత్మహత్యా? ఇది హత్యనా లేక ఆత్మహత్యా అనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దీనిని ఒక అనుమానాస్పద మృతిగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు.
సముదాయ స్పందన: మరణించిన నయన్ సాధు చటోగ్రామ్ జిల్లా దోహజారి ప్రాంతవాసి. అతను కాక్స్ బజార్ సదర్ ఉపజిల్లాలోని ఒక శివకాళి ఆలయంలో పూజారిగా, సంరక్షకుడిగా పనిచేస్తున్నట్లు బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ (BHBCUC) తెలిపింది. మూడు రోజుల గ్యాప్ ఉండటం చూస్తుంటే ఇది ఖచ్చితంగా హత్యేనని బంగ్లాదేశ్ పూజా సెలబ్రేషన్ కౌన్సిల్ ప్రతినిధులు వాదిస్తున్నారు.
మైనారిటీల్లో ఆందోళన: ఈ ఘటనపై మైనారిటీ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. “ఒక మారుమూల ప్రాంతంలోని చిన్న ఆలయ సంరక్షకుడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది?” అని BHBCUC సీనియర్ సభ్యుడు కాజల్ దేవనాథ్ ప్రశ్నించారు. ఈ ఏడాది జనవరి 1 నుండి మార్చి 31 మధ్య బంగ్లాదేశ్లో 133 మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగినట్లు కౌన్సిల్ నివేదించింది.
