రాంచీ: స్నేహితురాలి పుట్టినరోజు వేడుక అని నమ్మి వెళ్లిన ఆ మెడికల్ విద్యార్థినికి అక్కడ నరకం కనిపించింది. కేకు కోయగానే మొదలైన నిషా.. పిజ్జా తినేసరికి పరాకాష్టకు చేరింది. మత్తులో ఉన్న యువతిపై ఒక మృగం విరుచుకుపడి ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
బర్త్‌డే పార్టీ సాక్షిగా ‘డ్రగ్’ స్కెచ్!
బరియాతులోని ఒక గర్ల్స్ హాస్టల్లో ఉంటూ మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ (MDS) చదువుతున్న బాధితురాలు.. తన స్నేహితురాలు ‘ఓలీ’ బర్త్‌డే పార్టీకి వెళ్ళింది. లాల్పూర్ ప్రాంతంలోని గోకుల్ వాటిక అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులో ఈ వేడుక జరిగింది. పార్టీకి తనతో పాటు ఇతర అమ్మాయిలు కూడా వస్తారని నమ్మించి ఆమెను రప్పించారు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే.. ఓలీతో పాటు ఆమె నలుగురు మగ స్నేహితులు మాత్రమే ఉన్నారు.
పిజ్జా తిన్నాక స్పృహ కోల్పోయి..
రాత్రి 8 గంటల సమయంలో కేకు కోశారు. ఆ కేకు తిన్న కొద్దిసేపటికే బాధితురాలికి విపరీతమైన నీరసం, ఆకలి మొదలైంది. ఇదే అదనుగా భావించిన నిందితులు ఆమెకు పిజ్జా ఇచ్చారు. ఆ పిజ్జా తిన్న వెంటనే ఆమెకు లోకం తెలియని మత్తు ఆవరించింది. మెల్లగా ఆమె పక్క గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, నిందితుడు డానిష్ లోపలికి వెళ్లి తలుపులు గడియ పెట్టాడు. మత్తులో ఉన్న యువతి కనీసం ప్రతిఘటించలేని స్థితిలో ఉండగా, ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
కన్నీటి పర్యంతమైన బాధితురాలు:
మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన బాధితురాలు, తన పరిస్థితి చూసి షాక్‌కు గురైంది. ఒంటిపై గాయాలతో ఉన్న ఆమె తన మరో స్నేహితురాలికి ఫోన్ చేయగా, ఆమె వచ్చి బాధితురాలిని ఆర్కిడ్ ఆసుపత్రిలో చేర్పించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తనపై జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆ విద్యార్థిని కన్నీరుమున్నీరైంది.
పోలీసుల వేట.. డానిష్ అరెస్ట్!
లాల్పూర్ పోలీసులు ఈ ఘటనపై తక్షణమే స్పందించి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ప్రధాన నిందితుడు డానిష్‌ను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు.
- ఫోరెన్సిక్ విచారణ: కేకు, పిజ్జాలో నిజంగానే మత్తు పదార్థాలు కలిపారా? అనే కోణంలో పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్టు కోసం వేచి చూస్తున్నారు.
- మిగిలిన వారి పాత్ర: ఈ కుట్రలో ఓలీతో పాటు మిగిలిన నలుగురు స్నేహితుల పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
“ప్రతి కోణంలోనూ లోతైన విచారణ జరుపుతున్నాం. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం” అని లాల్పూర్ ఎస్సై రూపేష్ కుమార్ తెలిపారు. విద్యావంతులు, ఉన్నత చదువులు చదువుతున్న వారు ఉండే చోటే ఇలాంటి దారుణాలు జరగడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
