బాగా నిద్రపోయినా రోజంతా నీరసంగా అనిపిస్తోందా..? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!

రాత్రి సమయంలో తగినంత సేపు నిద్రపోయినప్పటికీ, పగలంతా అలసటగా, ఒంట్లో సత్తువ లేనట్లు అనిపించడానికి అనేక కారణాలు ఉండవచ్చు.

కేవలం నిద్రలేమి లేదా పని ఒత్తిడి మాత్రమే దీనికి కారణమని అనుకోకూడదు. శరీరంలో ఐరన్ (ఇనుము) లోపం ఉండటం కూడా నిరంతరం నీరసం రావడానికి ఒక ప్రధాన కారణం కావచ్చు.

శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడానికి ఐరన్ ఎంతో ముఖ్యం. హిమోగ్లోబిన్ ద్వారానే శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఐరన్ లోపం ఎక్కువైనప్పుడు అది రక్తహీనత (అనీమియా)కు దారితీస్తుంది. దీనివల్ల కొందరిలో విపరీతమైన అలసట, బలహీనత, శరీరంలో శక్తి లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వీటితో పాటు కళ్లు తిరగడం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మం పాలిపోవడం, దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం వంటి ఇతర లక్షణాలు కూడా కొందరిలో కనిపించవచ్చు. గోళ్లు పెళుసుగా మారడం లేదా సుద్దముక్కలు, మట్టి వంటి సాధారణం కాని పదార్థాలను తినాలనిపించడం (పైకా లక్షణం) కూడా ఐరన్ లోపానికి సంబంధించిన సంకేతాలు కావచ్చు.

అయితే, ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన అది కచ్చితంగా ఐరన్ లోపమే అని నిర్ధారించలేము. నిరంతరం అలసట లేదా పైన పేర్కొన్న లక్షణాలు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు (CBC, ఫెర్రిటిన్ టెస్ట్) చేయించుకోవడం ఎంతో అవసరం. అసలు కారణం తెలియకుండా సొంతంగా ఐరన్ మాత్రలు వాడకుండా, వైద్యుల సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవడం సురక్షితం.


Posted

in

by

Tags: