ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్ సందర్భంగా.. ప్రేక్షకుల గ్యాలరీలో ఓ జంట నిద్రపోతున్న దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.
పాకిస్థాన్ బ్యాటర్లు బాబర్ ఆజం, షాన్ మసూద్ క్రీజులో పాతుకుపోయి అత్యంత నిదానంగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్న సమయంలో ఈ ఘటన లైవ్ కెమెరాలో రికార్డయ్యింది.
లైవ్ ప్రసారంలో.. ఓ వ్యక్తి పక్కనే ఉన్న మహిళ భుజంపై తలవాల్చి గాఢ నిద్రలోకి జారుకోగా, ఆ మహిళ సన్‌గ్లాసెస్ పెట్టుకుని చేతులు కట్టుకుని నిశ్శబ్దంగా కూర్చుని కనిపించింది. ఈ జంట కెమెరా కంటికి చిక్కిన ఆ సమయంలో.. తొలి ఇన్నింగ్స్‌లో 320 పరుగుల భారీ వెనుకంజలో పడిన పాకిస్థాన్ జట్టు 158/3 స్కోరుతో మ్యాచ్‌ను కాపాడుకునేందుకు పోరాడుతోంది.
ఈ దృశ్యాన్ని చూసిన లైవ్ టీవీ కామెంటేటర్ సరదాగా స్పందిస్తూ.. “ఎంతసేపటికీ వికెట్ పడకపోవడంతో ప్రేక్షకులు నిద్రలోకి జారుకుంటున్నారు” అని చమత్కరించడం అభిమానుల్లో నవ్వులు పూయించింది. మరోవైపు మ్యాచ్‌లో పట్టువదలని షాన్ మసూద్ 95 పరుగులు చేయగా, బాబర్ ఆజం తన 38వ టెస్టు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని పాక్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
