బిర్యానీ తిని చనిపోలేదు..! “నల్లగా ఉందని 6 ఏళ్ల కూతురిని చంపిన కన్నతల్లి”.. ప్రియుడితో కలిసి ఘోరం.. విదేశాల నుండి వచ్చిన రిపోర్ట్‌తో బట్టబయలైన నిజం!!

కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలో గుండెల్ని పిండేసే ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తమ అక్రమ సంబంధానికి అడ్డంగా ఉందనే కారణంతో.. ఒక కన్నతల్లి, ఆమె ప్రియుడు కలిసి 6 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు.

దావణగెరె ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తితో 19 ఏళ్ల క్రితం ప్రియాంక అనే మహిళకు వివాహం జరిగింది. వీరికి 17 ఏళ్ల కుమార్తె, అలాగే ‘వెన్నెల’ అనే 6 ఏళ్ల చిన్నారి ఉన్నారు. ఈ క్రమంలో, ప్రియాంకకు ఆమె కాలేజీ రోజుల నాటి స్నేహితుడైన మోహన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది.

ఈ విషయం భర్త ప్రవీణ్‌కు తెలిసి ఆమెను హెచ్చరించినప్పటికీ, ప్రియాంక తన అక్రమ సంబంధాన్ని వదులుకోలేదు. పైగా, భర్తతో విడాకులు కావాలంటూ గొడవపడటమే కాకుండా, తన 6 ఏళ్ల చిన్న కుమార్తె వెన్నెలను మాత్రమే తనతో పాటు తీసుకుని ప్రియుడు మోహన్‌తో కలిసి విడిగా జీవించడం ప్రారంభించింది.

బిర్యానీ డ్రామా ఆడిన తల్లి
గత మార్చి 24న కుమార్తె వెన్నెల అకస్మాత్తుగా చనిపోయిందని ప్రవీణ్‌కు ప్రియాంక సమాచారం ఇచ్చింది. కూతురికి హోటల్‌లో బిర్యానీ, ఐస్‌క్రీమ్ కొనిచ్చి ఏసీ కార్‌లో పడుకోబెట్టానని.. ఆ సమయంలోనే ఆమె చనిపోయిందంటూ నమ్మబలికి నాటకమాడింది. అయితే, భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రవీణ్.. కుమార్తె వెన్నెల పోస్ట్‌మార్టం (శవపరీక్ష) నివేదికను సేకరించి, విదేశాల్లో డాక్టర్‌గా ఉన్న తన బంధువుకు పంపాడు. ఆ రిపోర్ట్‌ను పరిశీలించిన ఆ డాక్టర్.. సదరు చిన్నారి బిర్యానీ తిని చనిపోలేదని, ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్య చేశారనే షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు.

విచారణలో తేలిన నల్ల రంగు వివాదం
డాక్టర్ చెప్పిన నిజంతో షాక్‌కు గురైన భర్త ప్రవీణ్.. ఘటన జరిగిన 3 నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో ముమ్మర విచారణ చేపట్టారు. ఈ విచారణలో.. కుమార్తె నల్లగా (నలుపు రంగులో) ఉండటం వల్ల ఆ తల్లి అసహ్యించుకునేదని, దానికి తోడు తమ అక్రమ సంబంధానికి ఆమె అడ్డుగా ఉందనే కారణంతోనే ప్రియాంక, ఆమె ప్రియుడు మోహన్ కలిసి ఆ పాపను హత్య చేసినట్లు నిరూపితమైంది. ప్రస్తుతం ప్రియుడు మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న కన్నకూతురినే కాటేసిన ఆ క్రూరమైన తల్లి ప్రియాంక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Posted

in

by

Tags: